చైనాకు కౌంటర్‌గా .. భారత్ అతి పెద్ద డ్యామ్‌ నిర్మాణం

Updated on: Jun 28, 2026 | 6:23 PM

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో యార్లుంగ్ త్సాంగ్పో నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టును చైనా ప్రారంభించడంతో భారత్ అప్రమత్తమైంది. దీనికి ప్రతిస్పందనగా సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ విద్యుత్ ఉత్పత్తితో పాటు వరద నియంత్రణ, నీటి భద్రత, ఈశాన్య రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడడంలో కీలక పాత్ర పోషించనుంది.

ఇన్నాళ్లుగా భారతసరిహద్దుల్లో అలజడులు సృష్టిస్తూన్న చైనా.. ఇప్పుడు జలవనరులను ఆయుధంగా వాడుకోవడానికి సరికొత్త కుట్రకు తెరలేపింది. టిబెట్ ప్రాంతంలోని యార్లుంగ్ త్సాంగ్పో నది దిగువ భాగంలో ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ డ్యామ్ నిర్మాణాన్ని చైనా అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌కు మేడోగ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. దీని సామర్థ్యం అక్షరాలా 60,000 మెగావాట్లు. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ఈ భారీ డ్యామ్ మన దేశ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే నిర్మితమవుతోంది. ఈ నిర్మాణం భారత్‌కు భద్రతా పరమైన , పర్యావరణ పరమైన సవాలుగా మారింది. దీనివలన రాబోయే రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో నీటి కొరత, వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చైనా చేస్తున్న ఈ జల కుట్రకు భారత్ అంతే వేగంగా, వ్యూహాత్మకంగా సమాధానం ఇవ్వడానికి సిద్ధమైంది. అరుణాచల్ లోని అప్పర్ సియాంగ్, సియాంగ్ జిల్లాల పరిధిలో సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌హెచ్‌పీసీ ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను చూసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ గనుక పూర్తయితే ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా నిలుస్తుంది. దీని అంచనా వ్యయం సుమారు రూ.1.5 లక్షల కోట్లు కావడం విశేషం. ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 47 బిలియన్ యూనిట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి కానుంది. టిబెట్‌లో ప్రవహించే యార్లుంగ్ త్సాంగ్పో నది.. భారతదేశంలోకి ప్రవేశించగానే సియాంగ్ నదిగా మారుతుంది. ఆ తర్వాత అస్సాంలోకి వెళ్లాక దీనినే బ్రహ్మపుత్ర నది అని పిలుస్తారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోని కోట్ల మంది ప్రజల తాగునీరు, సాగునీరు, జీవనోపాధికి ఈ నదే ప్రధాన ఆధారం. నది ఎగువ భాగంలో చైనా అంత పెద్ద డ్యామ్ కట్టడం వల్ల నదీ ప్రవాహ దిశ పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల స్థానిక పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, దిగువన ఉన్న భారతీయ ప్రాంతాలలో అకస్మాత్తుగా ఊహించని వరదలు వచ్చే ముప్పు ఉంది. అయితే. భారత్ నిర్మించబోయే సియాంగ్ ప్రాజెక్ట్ కేవలం కరెంట్ ఉత్పత్తి కోసమే కాకుండా.. చైనా ఒకేసారి నీటిని వదిలితే వచ్చే కృత్రిమ వరదలను అడ్డుకోవడానికి, నీటిని నిల్వ చేయడానికి ఒక రక్షణ కవచంలా ఉపయోగపడనుంది. సరిహద్దులు దాటి ప్రవహించే నదులపై భారీ ప్రాజెక్టుల విషయంలో పారదర్శకత పాటించాలని, సమాచారాన్ని పంచుకోవాలని, ముందస్తు సంప్రదింపులు జరపాలని భారత్ చైనాపై ఒత్తిడి తెచ్చింది. కానీ, ఇప్పటివరకు చైనా స్పందించలేదు.చైనా తీరుపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు సూచించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జీతం రూ.లక్ష.. సేవింగ్స్ సున్నా.. ముంచుతున్నవి ఈ అలవాట్లే!

RAAKA: ‘రాకా’ తో హాలీవుడ్‌తో ఢీ! ది పాత్ బ్రేకర్ బన్నీ!

ఔను.. ముగ్గురితో నాకు ఎఫైర్ ఉంది ! ఒప్పుకున్న బిల్ గేట్స్‌

సీటుకోసం సమరం.. పాలిటిక్స్‌లో కాదు.. ఆర్టీసీ బస్సులో..

గుడ్‌న్యూస్‌.. పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!

Follow Us