Weather Updates: బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో వారం పాటు వర్షాలు!
ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. తెలంగాణలోనూ ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశముంది. పలు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలం, జూరాల, తుంగభద్ర, మానేరు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రజలు, రైతులు, మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
ఉత్తర బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావం కారణంగా కోస్తా అలాగే రాయలసీమ జిల్లాల్లో రానున్న వారం రోజుల పాటు వర్షాలు కురిసే వీలుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాకు ఆదివారం రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.. పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో 4.4 సెంటీమీటర్లు, కడప జిల్లా దువ్వూరులో 4.2, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 4, పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో 3.8, గుంటూరు జిల్లా తెనాలి 3.6, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ 3 సెంటీమీటర్లు, కడప జిల్లా రాజుపాలెంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 43 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 43,580 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 4,600 క్యూసెక్కులుగా ఉంది. 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను.. ప్రస్తుతం 878 అడుగుల దగ్గర నీటిమట్టం ఉంది. 181 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది, ఎడమగట్టులో నిలిచిపోయింది. కర్నూలు జిల్లా తుంగభద్ర డ్యామ్‌కు వరద నీరు కొనసాగుతోంది.. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 42,450 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,757 క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,625 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 79 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలోని గ్రామ దేవత సత్యమ్మ దేవాలయంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు వర్షాలు పడకపోవడంతో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని వేడుకున్నారు. దేవాలయంలోని బొడ్రాయికి ఘనంగా జలాభిషేకం చేసి, అమ్మవారికి పసుపు, కుంకుమ, ప్రత్యేక పువ్వులు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. వర్షాలు రానప్పుడు గ్రామ దేవతను శాంతింపజేసి పూజలు చేస్తే కచ్చితంగా వర్షం కురుస్తుందని ఇక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంతో గ్రామస్తులందరూ ఏకమై వరుణ దేవుని కరుణ కోసం భక్తితో ప్రార్థనలు చేశారు. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో సోమవారం ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని సూచించింది. ఈనెల 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఆకాశం మేఘావృతమై ఉండి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణాలు చేసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. వ్యవసాయ పనుల్లో ఉన్న రైతులు పొలాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలి. చెట్ల కింద నిలబడవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు కూడా వర్ష సూచన జారీ చేసింది. ఖమ్మం జిల్లాలోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే వీలుందని అధికారులు తెలిపారు. ఈదురుగాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వర్షాలు ఈ నెల 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం గేట్లు మూసివేశారు. ప్రాజెక్టుకు 43వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 47వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. 318 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను.. ప్రస్తుతం 317 మీటర్ల దగ్గర నీటిమట్టం ఉంది. 8 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ఎగువ, దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల్లో 9 యూనిట్లతో 354 మెగావాట్ల ఉత్పత్తి కొనసాగుతోంది. లోయర్ మానేరు డ్యామ్‌కు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 5,677 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. డ్యామ్ నుంచి 216 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 920 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను.. ప్రస్తుతం 892 అడుగుల దగ్గర నీటిమట్టం ఉంది. 24 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికి గాను.. ప్రస్తుతం 7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 15వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 5,400 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. 27 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యానికి గాను.. ప్రస్తుతం 21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పరిస్థితిని గమనించిన వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా?
పాడైన నోట్లను మార్చడానికి బ్యాంకు నిరాకరిస్తోందా? మీరు కంప్లైంట్ చేయొచ్చు తెలుసా!
Bigg Boss Season 10: బిగ్ సర్‌ప్రైజ్.. బిగ్ బాస్ ఆ రోజు నుంచి మొదలు..
డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..!
