తెలుగు రాష్ట్రాల్లో బీభత్స సృష్టిస్తున్న వాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా మారింది. ఓవైపు భానుడి భగభగలు, తీవ్రమైన వడగాల్పులతో జనం అల్లాడిపోతుంటే.. మరోవైపు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఎండల తీవ్రతకు తోడు పిడుగులు, ఈదురు గాలులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరనుంది. రాష్ట్రంలోని 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 155 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉంది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గరిష్టంగా 43 నుంచి 44 డిగ్రీల తీవ్రతతో ఎండలు మండిపోనున్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల వాతావరణం చల్లబడనుంది. బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా?
సనాతనధర్మం అంటే మతం కాదు..జీవన విధానం
బాబాయ్ నుంచి అబ్బాయికి తియ్యటి కబురు!
‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..