టాలీవుడ్ 2025 రివ్యూ.. ఈ ఏడాది మనోళ్లు సాధించిన విజయాలేంటి ??

Edited By:

Updated on: Dec 31, 2025 | 5:30 PM

2025 టాలీవుడ్‌కు నిరాశాజనక ఏడాదిగా నిలిచింది. 2022-2024 అద్భుత విజయాల తర్వాత, పాన్ ఇండియా తెలుగు సినిమాలు ఈ ఏడాది ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయి. పెద్ద బడ్జెట్ చిత్రాలు నిరాశపరిచగా, చిన్న సినిమాలే ఇండస్ట్రీకి ఊపిరిపోశాయి. 2026లో అయినా టాలీవుడ్‌కు మంచి ఫలితాలు వస్తాయో లేదో చూడాలి.

చూస్తుండగానే 2025 అయిపోయింది.. మరికొన్ని గంటల్లో 2026 వచ్చేస్తుంది. మరి ఈ ఏడాది మొత్తంలో టాలీవుడ్ ఏం సాధించింది..? మాట్లాడితే ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అంటూ జబ్బలు చరుచుకోవడం మినహాయిస్తే.. 2025లో మనకు దక్కింది శూన్యమే అనే విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. నిజమేగా.. అసలు ఈ ఏడాది మనోళ్లు సాధించేందేంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..! 2022 నుంచి 2024 వరకు తెలుగు సినిమా దేశంలోనే టాప్‌లో నిలిచింది. ఈ గ్యాప్‌లో RRR 1200 కోట్లు.. పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 2కు 1200 కోట్లు, సలార్ 650 కోట్లు, దేవర 500 కోట్లతో రికార్డులు తిరగరాసాయి. ఈ జోరు 2025లోనూ కంటిన్యూ అవుతుందేమో అనుకుంటే.. తోక ముడిచాయి మన సినిమాలు. ఈ ఏడాది పురోగమనం పక్కనబెడితే.. తిరోగమనం అయిపోయింది. 2025లో ప్యాన్ ఇండియా సినిమాలకు కలిసొచ్చిందేం లేదు. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ రాలేదు.. వచ్చినోళ్ల సినిమాలు ఆడలేదు. సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం.. సెప్టెంబర్‌లో వచ్చిన OG మాత్రమే 300 కోట్ల క్లబ్బులో చేరాయి. 200 కోట్ల సినిమాలు ఈ ఏడాది ఏం లేవు. మిరాయ్, హిట్ 3, డాకూ మహారాజ్, కుబేరా.. మొన్న అఖండ 2 మాత్రమే 100 కోట్ల క్లబ్బులో చేరాయి.. మాట్లాడితే ప్యాన్ ఇండియా, మాది వందల కోట్ల బడ్జెట్ అనే మన మేకర్స్.. 2025లో పూర్తిగా గాడి తప్పారు. ఇక మన హీరోలకి కూడా ఈ ఫలితాలు మేలుకొలుపే. 2025లో చిన్న సినిమాలే ఇండస్ట్రీని కాపాడాయి. సమ్మర్‌లో కోర్ట్, మ్యాడ్ స్క్వేర్.. ఆ తర్వాత లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి.. క్రిస్మస్‌కు శంబాలా, ఈషా లాంటి సినిమాలే బయ్యర్లను కాపాడాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన చాలా సినిమాలు 2025లో దారుణంగా నిరాశపరిచాయి. అది రామ్ చరణ్ గేమ్ ఛేంజరైనా.. ఎన్టీఆర్ డెబ్యూ మూవీ వార్ 2 అయినా.. పవన్ ప్యాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు అయినా.. డిస్ట్రిబ్యూటర్లకు నిద్ర లేని రాత్రుల్ని మిగిల్చాయి. ఓవరాల్‌గా 2025 టాలీవుడ్‌కు చేదు జ్ఞాపకాలే ఎక్కువ. మరి 2026లో అయినా ఆ గాయానికి మందు దొరుకుతుందో లేదో చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Suresh Babu: ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడు సురేష్ బాబు ఏడాదిలో ఏం చేయబోతున్నారు

క్రిస్మస్ విన్నర్ ఎవరు.. పైచేయి ఆ హీరోదేనా..?

Published on: Dec 31, 2025 04:28 PM