Video: పెద్దపులి బోనులో నుంచి అడవిలోకి దూసుకెళ్తే.. ఎట్టా ఉంటదో తెలుసా..? వీడియో ఇదిగో..

Edited By:

Updated on: Feb 19, 2026 | 1:15 PM

వారం రోజుల ఉత్కంఠ.. వందల మంది అటవీ శాఖ సిబ్బంది గాలింపు.. మూడు రాష్ట్రాలను వణికించిన ఆ క్రూర మృగం కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆ పెద్దపులిని అధికారులు పట్టుకుని పాపికొండల అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి కథ సుఖాంతమైంది. మూడు రాష్ట్రాల్లో సంచరిస్తూ, పశువులపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేసిన ఆ క్రూర మృగాన్ని అటవీశాఖ అధికారులు చాకచక్యంగా బంధించి, సురక్షితంగా పాపికొండల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఫారెస్ట్ అధికారులు తాజాగా విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా కుర్మపురం గ్రామంలో వారం రోజులుగా తిష్టవేసిన పులిని విశాఖ అటవీ అధికారులు ఫిబ్రవరి 6న పట్టుకున్నారు. 7న బంధించిన పులిని వెంటనే విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌కు తరలించారు. అక్కడ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో పులి ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరీక్షించారు. పులి ఆరోగ్యం నిలకడగా ఉందని నిర్ధారించుకున్నాక, దాని కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా మెడకు రేడియో కాలర్‌ను అమర్చారు.

రెండు రోజుల క్రితం అటవీశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో పాపికొండల అటవీ ప్రాంతం మధ్యలో పులిని వదిలిపెట్టారు. బోను తలుపులు తీయగానే పులి గంభీరంగా అడవిలోకి వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పెద్దపులి కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా మరో రెండు పొరుగు రాష్ట్రాల్లో కూడా సంచరించినట్లు సమాచారం. ఈ క్రమంలో పలుచోట్ల పశువులపై దాడులు చేయడంతో రైతులు, స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఎట్టకేలకు అధికారులు దానిని బంధించి అడవిలోకి పంపడంతో కుర్మపురం ప్రజలతో పాటు జిల్లా వాసులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Published on: Feb 19, 2026 01:12 PM
Follow Us