AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఆట్రోవర్ట్‌’ లక్షణాలు మీలో ఉన్నాయా? అలాంటి వారే ఇలా ఉంటారట..!

‘ఆట్రోవర్ట్‌’ లక్షణాలు మీలో ఉన్నాయా? అలాంటి వారే ఇలా ఉంటారట..!

Phani CH
|

Updated on: Sep 28, 2025 | 1:08 PM

Share

నలుగురితో కలివిడిగా ఉండటానికి ఇష్టపడని వారిని మనం.. ఇంట్రావర్టులు అంటుంటాం. ఏదైనా జరిగినా అంటీ ముట్టనట్లు ఉండటం, ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించటం వీరి లక్షణాలు. ఇక.. ఎక్స్‌ట్రావర్టులు. వీరు దేన్నీ దాచుకోలేని మనుషులు. కొత్త మనుషులు కనిపించినా.. వీరే ఎదురెళ్లి పరిచయం చేసుకుని మరీ.. స్నేహం పెంచుకుంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవటం, గలగలా మాట్లాడటం వీరి లక్షణాలు.

ఇక మూడో రకం.. యాంబీవర్టులు. వీరిలో పై రెండు లక్షణాలూ కలగలిసి ఉంటాయి. అయితే.. సమయాన్ని బట్టి వీరి ప్రవర్తన మారుతూ ఉంటుంది. అంటే.. ఒక్కోసారి నలుగురితో ఇట్టే కలిసిపోతారు. మరికొన్ని సార్లు అసలే బయటకి రావటానికి ఇష్టపడరన్నమాట. ఇప్పటి వరకు మన ప్రపంచంలోని అందరూ ఈ మూడింటిలో ఏదో ఒక కేటగిరిలో ఉంటారని చెప్పేవారు.అయితే.. ఇప్పుడు నాలుగో రకం మనుషులూ ఉన్నారని అమెరికాకు చెందిన సైకియాట్రిస్ట్‌ డాక్టర్ రామి కమిన్‌స్కి చెబుతున్నారు. వారినే.. ‘ఆట్రోవర్ట్‌’లు అంటారట. ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వంటి మేధావుల ఈ కోవకు చెందుతారట. సైన్స్‌ మ్యాగజైన్‌ ‘న్యూ సైంటిస్ట్‌’లో సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ రామి కమిన్‌స్కి ‘ఆట్రోవర్ట్‌’ గురించి ప్రస్తావించారు. అంతేకాదు, దీనిపై ఏకంగా ‘ద గిఫ్ట్‌ ఆఫ్‌ నాట్‌ బిలాంగింగ్‌’ అనే పుస్తకమే రాశారు. ఆట్రోవర్ట్‌లు చాలా ప్రత్యేకం.. అంటారు కమిన్‌స్కి. ‘ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు ఇతరుల మీద ఆధారపడరు. తమ సమస్యను నలుగురిలో పెట్టరు. అలాగని ఒక్కళ్లూ కూర్చుని మథనమూ చేయరు. వ్యక్తిగతంగా తాము నమ్మినవాళ్లతో లోతుగా చర్చించి విశ్లేషణ చేయడానికి, సమస్య పరిష్కారానికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు’ అని వీరి లక్షణాలను చెబుతున్నారు కమిన్‌స్కీ. నలుగురూ ఆలోచించే పద్ధతికి భిన్నంగా, స్వతంత్రంగా వీరు ఆలోచిస్తారట. యాంబివర్ట్‌కీ… ఆట్రోవర్ట్‌కీ ఏంటి తేడా అని చాలామందికి అనిపించవచ్చు. కానీ చాలా తేడా ఉంది. సమయం, సందర్భాన్ని బట్టి యాంబివర్ట్‌లు అంతర్ముఖులుగానో, బహిర్ముఖులుగానో ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు నలుగురితో కలిసినప్పుడు చురుగ్గా ఉంటే.. కొన్నిసార్లు ఎవ్వరూ లేకపోయినా ఉత్సాహంగా పనిచేసుకుపోతారు. కానీ ఆట్రోవర్ట్‌లు అలాకాదు. సమయం, సందర్భాన్ని బట్టి వీరి ఆలోచనలు, వ్యక్తిత్వాలు, నిర్ణయాలు అసలే మారవట. వీళ్లు పార్టీల వంటి వేడుకలకు హాజరైనా .. అందరి దగ్గరకూ పోరు. వచ్చిన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాలని అనుకోరు. వ్యక్తులను అంచనావేసి, నచ్చిన ఆ కొద్దిమందితోనే మాట్లాడతారట. ఏదో ఒక సమూహానికి చెందిన వ్యక్తులుగా ముద్ర వేయించుకోవడానికంటే..వీరు వ్యక్తిగత సంబంధాలు, పనితీరును ఇష్టపడతారట. వ్యక్తులతో మాట్లాడటం కంటే.. వారిని పరిశీలించడానికే ఆసక్తి చూపుతారట. సమూహంలో ఉంటేనే చురుగ్గా ఆలోచించటం, ఒంటరిగా ఉంటే దిగులు పడటం లాంటివి వీరిలో కనిపించవని, స్థిరత్వం, ధైర్యం వంటివాటికి వీరు ప్రతీకలు అంటారు కమన్ స్కీ. జీవితంలో ఎలాంటి దెబ్బ తగిలినా లేదా సమస్యలో చిక్కుకున్నా.. ఎవరి సాయం లేకుండానే వీరు తిరిగి పూర్వ స్థితికి చేరుకుంటారట. వీరి దృష్టిలో నాయకత్వం అంటే అజమాయిషీ కాదు. ఎదుటివాళ్లు చెప్పేది శ్రద్ధగా విని.. ఎదుటివారి ఇబ్బందినీ సానుభూతితో వినే లక్షణం వీరి సొంతం. వీరికి చాలామంది స్నేహితులుండరు. కానీ, ఉన్న కొద్ది మందితో బలమైన అనుబంధం ఉంటుంది. సామాజిక సంబంధాల విషయంలోనూ వీరు ఆచితూచి వ్యవహరిస్తారు. ఎలాంటి పరిస్థితులనైనా ఇట్టే ఆకళింపు చేసుకుంటారు. తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే గాక.. ఎదుటివారి భావోద్వేగాలనూ అర్థం చేసుకోవడం వీరి ప్రత్యేకత అంటున్నారు డాక్టర్ రామి కమెన్‌స్కీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫేస్‌ బ్యాండ్‌తో తిప్పలు తప్పవా?

వామ్మో..పొట్ట నిండా చెంచాలు..టూత్‌ బ్రష్‌లే..