మహిళల్లోనే ఎక్కువ డిప్రెషన్‌ ఎందుకు? పరిశోధనల్లో బయటపడ్డ కీలక విషయాలు!

Updated on: Oct 21, 2025 | 2:23 PM

డిప్రెషన్‌.. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితాల్లో వయసుతో సంబంధం లేకుండా డిప్రెషన్‌ బారిన పడుతున్నారు. విద్యార్ధులు, యువత, మహిళలు, అందరూ ఈ డిప్రెషన్‌కు గురవుతున్నారు. పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఈ డిప్రెషన్‌కు గురువుతున్నారని పరిశోధనల్లో తేలింది. పురుషులతో పోలిస్తే మహిళల్లో డిప్రెషన్ ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు కీలక సమాధానం కనుగొన్నారు.

దీని వెనుక బలమైన జన్యుపరమైన కారణాలు ఉన్నాయని ఆస్ట్రేలియా పరిశోధకులు తమ తాజా అధ్యయనంలో తేల్చారు. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో డిప్రెషన్ చికిత్స విధానంలో విప్లవాత్మక మార్పులకు దారితీయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. QIMR బెర్గోఫర్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా లక్షలాది మంది డీఎన్ఏను విశ్లేషించారు. పురుషులతో పోలిస్తే మహిళల డీఎన్ఏలో డిప్రెషన్‌కు కారణమయ్యే జన్యుపరమైన సూచికలు దాదాపు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయని ఈ బృందం గుర్తించింది. ఈ పరిశోధన వివరాలను సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బ్రిటనీ మిచెల్ వెల్లడించారు. “సాధారణంగా మహిళలు తమ జీవితకాలంలో పురుషుల కన్నా రెండు రెట్లు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారని తెలుసు. కానీ, దీనికి గల కచ్చితమైన కారణాలపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, తమ అధ్యయనంలో స్త్రీ, పురుషులిద్దరిలో డిప్రెషన్‌కు కారణమయ్యే సుమారు 7,000 జన్యు మార్పులను గుర్తించామని, వీటికి అదనంగా, కేవలం మహిళల్లో మాత్రమే డిప్రెషన్‌కు దారితీసే మరో 6,000 జన్యు మార్పులను కనుగొన్నామని మిచెల్ పేర్కొన్నారు. మరో పరిశోధకురాలు డాక్టర్ జోడి థామస్ కీలక విషయాలను తెలిపారు. మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు భిన్నంగా ఉండటానికి కూడా ఈ జన్యువులే కారణమని వివరించారు. మహిళల్లో డిప్రెషన్‌కు సంబంధించిన జన్యువులు, వారి శరీరంలోని జీవక్రియలకు సంబంధించిన జన్యువులతో ముడిపడి ఉన్నట్టు తాము గుర్తించామని, అందుకే డిప్రెషన్‌తో బాధపడే మహిళల్లో ఇలాంటి శారీరక లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. స్త్రీ, పురుషుల్లో డిప్రెషన్‌కు గల జన్యుపరమైన తేడాలను అర్థం చేసుకోవడం ద్వారా, ఒక్కొక్కరికీ సరిపోయే ప్రత్యేకమైన చికిత్సలను అందించేందుకు ఈ అధ్యయనం బాగా ఉపయోగపడుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యువతకు హెచ్చరిక! మలంలో రక్తమా? క్యాన్సర్‌కు సంకేతం!