అలారం శబ్దంతో గుండెపోటు..!

Updated on: Sep 14, 2025 | 1:40 PM

ఉదయం అలారం మోగగానే.. అప్పుడే లేవాలా? అనిపిస్తుంది. మళ్లీ చేయాల్సిన పనులు గుర్తొచ్చి.. తప్పదు అనుకుంటూ లేస్తాం. అయితే ఈ మార్నింగ్ అలారం గురించి యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా చేసిన తాజా అధ్యయనం ఆశ్చర్యకర అంశాలను వెల్లడించింది. పొద్దున్నే వినిపించే అలారం మోత గుండెపోటు, స్ట్రోక్‌ వచ్చే ముప్పును పెంచుతుందని తెలిపింది.

32 మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. రెండు రోజులపాటు వారంతా నిద్రలో స్మార్ట్ వాచ్‌లు, ఫింగర్ బ్లడ్ ప్రెజర్ కఫ్స్‌ ధరించి అందులో పాల్గొన్నారు. ఎటువంటి అలారం లేకుండా సహజంగా నిద్రలేవమని మొదటిరోజు పరిశోధకులు ఆ 32 మందికి సూచించారు. రెండో రోజు.. ఐదు గంటలకు పైగా నిద్రపోయిన తర్వాత అలారం పెట్టుకొని లేవమని చెప్పారు. ఈ రెండు ఫలితాలను పరిశీలించగా.. సహజంగా, బలవంతంగా మేల్కొనడం మధ్య బ్లడ్‌ప్రెజర్‌లో పెరుగుదలను గుర్తించారు. సహజంగా నిద్రలేచేవారితో పోలిస్తే 74 శాతం అధికంగా బ్లడ్ ప్రెజర్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ రక్తపోటు పెరుగుదల నిద్ర తక్కువగా ఉన్న వ్యక్తుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలారం శబ్దం మన శరీరంలో ఒత్తిడిని ప్రేరేపిస్తుంది. ఆ స్పందన కారణంగా కార్టిసోల్‌, అడ్రినలిన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్లు గుండె వేగాన్ని పెంచుతాయి. రక్తనాళాలు కుచించుకుపోయేలా చేస్తాయి. అవి బీపీని పెంచేందుకు కారణమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. నిద్రలేవగానే ఇలా బీపీ పెరగడాన్ని మార్నింగ్ బ్లడ్‌ ప్రెజర్ సర్జ్ అని పిలుస్తారు. నిద్రసరిపోనప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉదయం పూట అలారంతో బీపీ పెరగడం తాత్కాలికమే అయితే ప్రమాదం లేదు కానీ.. కానీ తరచూ అదే పరిస్థితి ఎదురయితే.. మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలున్న వారికి ప్రమాదకరమని తెలిపారు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం ద్వారా అలారాన్ని దూరంగా ఉంచొచ్చు. ఆవలింతలు, అలసట వంటి శరీరం ఇచ్చే సిగ్నళ్లను గుర్తించి నిద్రకు ఉపక్రమించేలా చూసుకోవాలి. వ్యాయామాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. బెడ్‌పైన పడే లైటింగ్ సహజంగా ఉండేలా చూసుకోవాలి. అయితే ఇదంతా ఒక పైలట్ స్టడీ మాత్రమే కావడంతో ఈ అధ్యయనంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేమని, ఈ స్టడీ విస్తృత స్థాయిలో జరగాల్సి ఉందని నిపుణులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చలికాలంలో వెచ్చదనం, మండే ఎండల్లో కూల్.. ఈ ఇంటి డిజైన్‌ చూసారా?

ఆ దీవిలో అడుగు పెడితే చంపేస్తారు!

ఉపవాసంతో గుండె వ్యాధుల ముప్పు 135% ఎక్కువట

అద్భుతం.. ఐదు రంగుల నదిని చూసారా?