మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు !
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్’ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని కేంద్రానికి సూచించింది. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఇంధనం నిరాకరించే చర్యలతో పాటు బీమా గడువు పెంపు, ఏఎన్‌పీఆర్ టెక్నాలజీ వినియోగం వంటి కీలక సూచనలు చేసింది.
దేశంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా నడుస్తున్న వాహనాల సంఖ్య పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సరైన బీమా లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ విక్రయించడాన్ని నిరాకరించే దిశగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ క్రమంలో “నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్” విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ఆదేశించింది. తెలంగాణలో 1996లో జరిగిన ఓ రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన పరిహారంపై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనంవిచారణ చేపట్టింది. రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో 56 శాతం వాహనాలకు బీమా లేదని వ్యాఖ్యానించింది. దేశంలోని 30.48 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉంటే 16.54 కోట్ల వాహనాలకు ఎలాంటి బీమా లేదని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా ఏటా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రస్తావించింది. కనీస బీమా లేకపోవడం వల్ల ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు నష్టపరిహారం అందడంలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతోందని కోర్టు గుర్తు చేసింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలు అమల్లోకి వస్తే.. మోటారు వాహనాల చట్టాల్లో పలు మార్పులు రానున్నాయి. కొత్త కార్లకు తప్పనిసరిగా ఉండే థర్డ్ పార్టీ బీమా వ్యవధిని ప్రస్తుతమున్న 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెంచాలని ఐఆర్‌డీఏఐని కోర్టు ఆదేశించింది. కొత్త ద్విచక్ర వాహనాలకు ఈ గడువును 5 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పొడిగించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులు, నగరాల్లోని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ డేటాబేస్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలతో అనుసంధానించాలని కోర్టు ఆదేశించింది. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు ఏఎన్‌పీఆర్ టెక్నాలజీతో కూడిన టోలింగ్ విధానాలను మరింత విస్తరించాలని సూచించింది. ఈ సమస్యకు పరిష్కారంగా ‘నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్’ విధానం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను సులభంగా గుర్తించడమే కాకుండా, వాహన యజమానులకు తమ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గడువును గుర్తుచేసినట్లవుతుందని వివరించింది. ముందుగా హైవేలు, తరచుగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లు, ప్రధాన టోల్ ప్లాజాల వద్ద ఉన్న పెట్రోల్ బంకుల్లో ఈ పైలట్ ప్రాజెక్టును తక్షణమే ప్రారంభించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ నిర్ణయం అమలులోకి వస్తే దేశంలో వాహన బీమా నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.4000 కోట్ల ‘రామాయణం’.. యశ్, రణబీర్‌ల పారితోషికం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే!
కింగ్ కోబ్రా గూడును ఎప్పుడైనా చూశారా.. అరుదైన రాచనాగు ప్రత్యేకత ఇదే!
నేనూ చదువుకుంటాను.. స్కూల్లో కొత్త అతిథిని చూసి హడలిపోయిన విద్యార్ధులు
సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. ఫైన్ రూ.19 లక్షలు.. కానీ షాకింగ్ ట్విస్ట్!
