క్రెడిట్ కార్డు, డిజిటల్ మోసాలకు చెక్.. ఆర్‌బీఐ సంచలన నిబంధనలు!
డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు మోసాల బారినపడిన ఖాతాదారులకు ఆర్‌బీఐ కీలక ఊరటనిచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం అర్హత ఉన్న సైబర్ మోసాల కేసుల్లో బ్యాంకులు ఐదు రోజుల్లోపు తాత్కాలిక క్రెడిట్ లేదా షాడో రివర్సల్ ద్వారా సొమ్ము జమ చేయాలి. అలాగే రూ.500కు పైబడిన ప్రతి డిజిటల్ లావాదేవీకి ఉచిత ఎస్‌ఎంఎస్ అలర్ట్ పంపడం కూడా తప్పనిసరి కానుంది.
డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు మోసాల బారిన పడే ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఉపశమనం కలిగించింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే కేవలం 5 రోజుల్లోనే ఆ మొత్తాన్ని బ్యాంకులు ‘షాడో రివర్సల్’ లేదా ‘తాత్కాలిక క్రెడిట్’ రూపంలో ఖాతాదారుడి అకౌంట్‌లో జమ చేయాలని ఆదేశించింది. సవరించిన ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. బ్యాంక్ వైపు ఉన్న లోపాలు లేదా నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే.. ఖాతాదారుడు ఆ విషయాన్ని ఫిర్యాదు చేసినా, చేయకపోయినా సరే ‘లావాదేవీని రద్దు చేసి, పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కి ఇవ్వాలి. ఒకవేళ బ్యాంక్ లేదా ఖాతాదారుడి తప్పు లేకుండా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగితే.. 5 రోజుల్లోపు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే ఖాతాదారుడికి ఎలాంటి బాధ్యత ఉండదు. మోసపూరిత లావాదేవీ ఏ రోజైతే జరిగిందో, అదే తేదీతో సొమ్మును రీఫండ్ చేయాలి. దీనివల్ల ఖాతాదారుడిపై అదనపు వడ్డీ లేదా ఛార్జీల భారం పడదు. కానీ ఖాతాదారులే స్వయంగా ఓటీపీ లేదా పాస్‌వర్డ్స్ షేర్ చేయడం వల్ల నష్టపోతే మాత్రం వారే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొదటిసారి డిజిటల్ మోసాల బారిన పడి రూ.50,000 లోపు నష్టపోయిన వారికి, జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రత్యేక సదుపాయం వర్తిస్తుంది. ఇందులో నష్టపోయిన మొత్తంలో 85% లేదా గరిష్ఠంగా రూ.25,000 పరిహారంగా అందుకోవచ్చు. ముఖ్యంగా రూ.29,412 కంటే తక్కువ విలువ గల దేశీయ మోసాల కేసుల్లో.. 85% పరిహారంలో 65 శాతాన్ని ఆర్‌బీఐ భరిస్తుంది. మిగిలిన మొత్తంలో కస్టమర్ బ్యాంక్ 10%, బెనిఫిషియరీ బ్యాంక్ 10% భరిస్తాయి. ఖాతాదారులు చేసే ప్రతి రూ.500 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఎలక్ట్రానిక్ లావాదేవీలకు బ్యాంకులు తప్పనిసరిగా ఉచితంగా తక్షణ ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు పంపాలి. రూ.500 లోపు లావాదేవీల అలర్ట్స్‌పై బ్యాంకులు సొంత నిర్ణయం తీసుకోవచ్చు కానీ, వాటికి కస్టమర్ల నుండి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. ఈ నిబంధనలను దేశంలోని అన్ని వాణిజ్య, స్మాల్ ఫైనాన్స్, పేమెంట్, కో-ఆపరేటివ్ బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టిఫిన్ సెంటర్‌లో వేడి వేడిగా వడలు లాగించేస్తున్నారా.. ఈ వీడియో చూడండి!
మురుగు కాల్వలో బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఇదో వెరైటీ నిరసన!
WhatsApp: వాట్సప్‌లో పెయిడ్ సేవలు.. ‘వాట్సప్ ప్లస్’ వచ్చేసిందోచ్
