విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది
ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, యుద్ధాల నేపథ్యంలో భారత్ తన బంగారు నిల్వలను విదేశాల నుండి స్వదేశానికి తరలిస్తోంది. ఆర్బీఐ ఈ చర్య ద్వారా తన సార్వభౌమత్వ ఆస్తిని కాపాడుకోవడమే కాకుండా, భవిష్యత్తు ఆర్థిక యుద్ధాల నుండి తనను తాను రక్షించుకోవాలని చూస్తోంది. బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా మారడంతో, కేంద్ర బ్యాంకులు దానిని తమ పోర్ట్‌ఫోలియోలలో పెంచుకుంటున్నాయి. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకం.
అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి ఒకవైపు.. ఇక మరోవైపు పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా మారింది. దీంతో కేంద్ర బ్యాంకులు తమ పోర్ట్‌ఫోలియోలో బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం భారత్ దగ్గర ఉన్న బంగారంలో ప్రస్తుతం 77 శాతం అంటే 880.5 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. మిగిలినది విదేశాల్లో ఉంది. భారత్ వీటిని ఇప్పుడు స్వదేశానికి రప్పిస్తోంది. చాలా దేశాలు.. విదేశీ వర్తకం కోసం బంగారాన్ని పెట్టి డాలర్స్ ను ట్రేడ్ చేస్తుంటాయి. ఇప్పుడు భారత్ ప్లాన్ మార్చింది. విదేశాల్లో ఉన్న బంగారాన్ని మెల్లగా ఇండియాకు తరలిస్తోంది. దీంతో గత నాలుగేళ్లలో దేశంలోని బంగారు నిల్వలు దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇప్పటివరకు.. ఆర్బీఐ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో బంగారం మన దేశంలో స్టాక్ ఉండటం ఇదే తొలిసారి. పలు దేశాలు.. తమ విదేశీ మారకంలో భాగంగా బంగారం నిల్వల్ని పెంచుకుంటున్నాయి. అందులో చైనా, భారత్ ముందుంటున్నాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం మారుతోంది. దాంతో కేంద్ర బ్యాంకులు తమ బంగారం వాటాను పెంచుకుంటున్నాయి. కరెన్సీ స్థిరీకరణ కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. 2023 మార్చి నుంచి ఆర్బీఐ పసిడిని వేగంగా తరలించడం ప్రారంభించింది. గత నాలుగేళ్లలో దాదాపు 280 టన్నుల పసిడిని వెనక్కి రప్పించింది. తన సార్వభౌమత్వ ఆస్తిని కాపాడుకునే విషయంలో కేంద్రం దూకుడు పెంచిందని చెప్పొచ్చు. విదేశాల్లో ఉన్న బంగారాన్ని భారత్ వెనక్కి తీసుకొచ్చేందుకు ముఖ్యమైన కారణాలే ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆర్థిక యుద్ధాలు జరుగుతున్న క్రమంలో కొన్నిదేశాలు విదేశీ ఆస్తుల్నిబ్లాక్ చేసే అవకాశం ఉంది. గతంలో రష్యా, అఫ్ఘానిస్థాన్ విదేశీ కరెన్సీ నిల్వల్ని జీ7 దేశాలు బ్లాక్ చేశాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనదేశానికి ఎదురవ్వకుండా మన బంగారాన్ని మనం తెచ్చేసుకుంటున్నాం అన్న మాట. గత నాలుగేళ్లలోనే దాదాపు 280 టన్నుల బంగారాన్ని భారత్ వెనక్కి రప్పించింది. నాలుగేళ్ల క్రితం వరకు మన బంగారంలో కేవలం 23 శాతం మాత్రమే దేశంలో ఉండేదని గుర్తు చేసుకుంటే, ఈ మార్పు ఎంత వేగంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఫ్యూచర్ లో మరింత బంగారాన్ని వెనక్కి తెచ్చే అవకాశం ఉంది. అలాగే దేశంలో ఉన్న బంగారు నిల్వలను పెంచే దిశగా కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇనాక్టివ్‌గా ఉన్న గోల్డ్ మైన్స్ ను యాక్టివేట్ చేసే ప్లాన్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంపై ఇప్పుడు ఆసక్తికర ‘రివర్స్ ట్రెండ్’ కనిపిస్తోంది. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ బంగారాన్ని లండన్ లేదా న్యూయార్క్ బ్యాంకుల్లో దాచుకోవడాన్ని సురక్షితంగా భావించేవి. అయితే నేడు కాలం మారింది. మన సంపద మన కళ్ల ముందే ఉండాలి అనే సరికొత్త ఆర్థిక సార్వభౌమత్వ నినాదం వినిపిస్తోంది. ఈ క్రమంలో భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా మారుతున్నాయి. ఈ నిశ్శబ్ద విప్లవం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాకు చెందిన విదేశీ నిల్వలను జీ7 దేశాలు స్తంభింపచేయడం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. మనం నమ్మి దాచుకున్న ఆస్తులను రాజకీయ కారణాలతో వేరే దేశం నిలిపివేయగలదా ? అన్న భయం ప్రతి దేశంలోనూ మొదలైంది. అందుకే, ఆర్థిక నిపుణులు అన్నట్లుగా- నీ దగ్గర భౌతికంగా Gold లేకపోతే, అది అసలు నీది కానే కాదు. ఈ ఆలోచనే భారతదేశాన్ని తన సంపదపై పూర్తి నియంత్రణ సాధించేలా ప్రేరేపించింది. న్యూయార్క్, లండన్ బ్యాంక్‌లు ఇప్పటికీ ప్రపంచ గోల్డ్ హబ్‌లుగా కొనసాగుతున్నాయి. దాదాపు 60 దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారాన్ని అక్కడి ఖజానాల్లోనే భద్రపరుస్తున్నాయి. కానీ ఇటీవల ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ క్రమంగా తమ నిల్వలను వెనక్కి తెచ్చుకోవడం ప్రారంభించాయి. భారత విదేశీ మారక ద్రవ్యంలో.. మొత్తం నిల్వల్లో పసిడి వాటానే ఇటీవల 13 శాతం దాటింది.ఇంకా కొన్ని వందల టన్నుల పసిడి నిల్వలు .. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ కస్టడీలో ఉన్నాయి. ఒకప్పుడు కేవలం లావాదేవీల సౌలభ్యం కోసం బంగారాన్ని విదేశాల్లో ఉంచిన భారత్, ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పులను ముందే పసిగట్టి తన ఖజానాను పటిష్టం చేసుకుంటోంది. ఇది కేవలం బంగారం తరలింపు మాత్రమే కాదు, భారతదేశం తన ఆస్తులపై సాధిస్తున్న సంపూర్ణ స్వేచ్ఛకు నిదర్శనం. భద్రత అంటే ఇతరులపై ఆధారపడటం కాదు, మన సంపద మన చేతిలో ఉండటమేనని భారత్ ప్రపంచానికి చాటి చెబుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్యాస్ పై బండ బాదుడు.. త్వరలో.. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటాయా ??
వాహనదారులపట్ల ట్రాఫిక్ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం
