రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్ ధరపై డిస్కౌంట్
భారతీయ రైల్వేశాఖ రైల్‌వన్ యాప్ ద్వారా జనరల్ టికెట్లు బుక్ చేసుకునేవారికి 3% తగ్గింపు ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ 2026 జనవరి 14 నుండి జులై 14 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసే చెల్లింపులకు ఈ రాయితీ లభిస్తుంది. కౌంటర్ల రద్దీ తగ్గించి, ప్రయాణికులను డిజిటల్ వైపు మళ్ళించడమే లక్ష్యం.
భారతీయ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో జనరల్ టికెట్లు కొనుగోలు చేసేవారికి డిస్కౌంట్ ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే లక్ష్యంగా జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి ఊరటనిస్తూ ‘రైల్‌వన్’ యాప్ ద్వారా బుక్ చేసుకునే అన్‌రిజర్వ్‌డ్ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ 2026 జనవరి 14 నుంచి జులై 14 వరకు ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు రైల్‌వన్ యాప్‌లో కేవలం ఆర్-వాలెట్ ద్వారా టికెట్ కొనుగోలు చేసినవారికి మాత్రమే 3 శాతం క్యాష్‌బ్యాక్ లభించేది. తాజా నిర్ణయంతో ఈ వెసులుబాటును అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు విస్తరించారు. ఇకపై యూపీఐ , డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ ద్వారా జనరల్ టికెట్ తీసుకున్నా 3 శాతం తగ్గింపు లభిస్తుంది. ఆర్-వాలెట్ ద్వారా జరిగే లావాదేవీలకు ప్రస్తుతం ఉన్న క్యాష్‌బ్యాక్ యథాతథంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ డిస్కౌంట్ కేవలం రైల్‌వన్ యాప్‌కు మాత్రమే పరిమితం. ఇతర ప్లాట్‌ఫామ్‌లు లేదా యూటీఎస్ యాప్ ద్వారా బుక్ చేసే టికెట్లకు ఇది వర్తించదు. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ను రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మే నెలలో ఈ ఆఫర్ పనితీరు, ప్రయాణికుల స్పందనను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. రైల్వే సేవలన్నీ ఒకే వేదికపైకి తెచ్చేందుకు రైల్‌వన్ సూపర్ యాప్‌ను రూపొందించారు. ఇందులో టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, రైలు ట్రాకింగ్ వంటి సేవలున్నాయి. ఈ కొత్త ఆఫర్ ద్వారా రైల్వే స్టేషన్లలో టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గుతుందని, ప్రయాణికులు డిజిటల్ విధానాల వైపు మొగ్గు చూపుతారని రైల్వే శాఖ భావిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మీ వయసును పాతికేళ్లకు తగ్గించే చిట్కా ఇదిగో
ORS ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే
ఈ రైతు ఆలోచనకు ఎవడైనా సలాం కొట్టాల్సిందే
రూ.50 పందెం కోసం పెన్ మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత సర్జరీ చేసి తొలగింపు