టోల్‌ బకాయిలుంటే వాహన సేవలు బంద్‌

Updated on: Jan 22, 2026 | 8:52 PM

కేంద్రం టోల్ నిబంధనలను కఠినతరం చేసింది. ఇకపై టోల్ బకాయిలుంటే వాహనానికి సంబంధించిన కీలక ప్రభుత్వ సేవలు నిలిచిపోతాయి. పాత మోటార్ వెహికల్స్ రూల్స్‌కు సవరణలు చేస్తూ, "అన్‌పెయిడ్ యూజర్ ఫీజు"కు నిర్వచనం ఇచ్చింది. వాహన యాజమాన్య బదిలీ, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్ వంటివి బకాయిలు చెల్లించే వరకు సాధ్యం కావు. టోల్ ఎగవేతను అరికట్టడం, భవిష్యత్తులో అడ్డంకులు లేని టోల్ విధానం లక్ష్యం. వెంటనే బకాయిలు క్లియర్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.

హైవేలపై ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్రం టోల్ రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది. టోల్ చెల్లింపులు బకాయి ఉంటే, వాహనానికి సంబంధించిన ప్రభుత్వ సేవలు నిలిచిపోతాయని స్పష్టం చేసింది. హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ స్కాన్ అవుతుంది, బీప్ సౌండ్ వస్తుంది, గేట్ పైకి లేస్తుంది.. ఇక పని అయిపోయిందనుకుంటాం. కానీ, ఇకపై అలా కాదు. టోల్ డబ్బు బకాయి ఉంటే దాని ప్రభావం నేరుగా మీ వాహన పత్రాలపై పడనుంది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్–2026 కింద ప్రభుత్వం ఈ మార్పులను అమలు చేసింది. 1989లో అమల్లోకి వచ్చిన పాత సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌కు సవరణలు చేసింది.. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వ్యవస్థను బలోపేతం చేయడం.. టోల్ ఎగవేతను అరికట్టడం.. భవిష్యత్తులో అడ్డంకులు లేని టోల్ విధానం అమలు చేయడం టార్గెట్‌గా పెట్టుకుంది కేంద్రం. కొత్త నియమాల్లో తొలిసారిగా “Unpaid User Fee ” అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు. వాహనం టోల్ ప్లాజా గుండా వెళ్లినట్లు ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లో నమోదు అయ్యి, కానీ జాతీయ రహదారుల చట్టం–1956 ప్రకారం చెల్లించాల్సిన టోల్ మొత్తాన్ని చెల్లించకపోతే, దాన్ని టోల్ బకాయిగా పరిగణిస్తారు. టోల్ బకాయిలు ఉన్న వాహనాలకు. వాహన యాజమాన్య బదిలీకి అవసరమైన NOC జారీ కాదు. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వాహనం బదిలీకి అనుమతి ఉండదు.. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ రెన్యూవల్ నిలిపేస్తారు.. అన్ని టోల్ బకాయిలు చెల్లించిన తరువాతే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నమాట. ఈ మార్పులు భవిష్యత్తులో అమలు చేయనున్న మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో టోల్ వ్యవస్థకు దోహదపడతాయట. ఈ విధానంలో వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. రద్దీ తగ్గి, ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, టెక్నాలజీ ద్వారా పారదర్శకత పెరుగుతుంది. అయితే, మీ వాహనానికి సంబంధించిన టోల్ చెల్లింపుల్లో ఏవైనా బకాయిలు ఉంటే, అవి వెంటనే క్లియర్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. లేదంటే, భవిష్యత్తులో కీలక వాహన పత్రాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం.. ఏం జరిగిందంటే

ట్రాఫిక్‌ చలాన్ల బలవంతపు వసూళ్లకు చెక్‌.. హైకోర్ట్‌ కీలక ఆదేశాలు

Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

Prabhas: ఇండియాలో నెంబర్ 1 స్టార్ మనోడే !!

Rashmika Mandanna: రష్మిక మాటలతో తప్పు ఎవరిదో తేలిపోయింది