ఆధార్‌ వినియోగదారులకు మరో గుడ్‌ న్యూస్‌

Updated on: Nov 14, 2025 | 1:13 PM

ఆధార్ వినియోగదారుల కోసం UIDAI కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఇది ఆధార్ వివరాలను సురక్షితంగా నిల్వ చేయడానికి, సులభంగా పంచుకోవడానికి ఉపకరిస్తుంది. ఫేస్ అథెంటికేషన్, కుటుంబ సభ్యుల డేటా నిల్వ వంటి ప్రత్యేకతలున్నాయి. భౌతిక కార్డు అవసరం లేకుండా పేపర్‌లెస్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది m-ఆధార్‌కు ప్రత్యామ్నాయం కాదు, కేవలం డేటా నిల్వ కోసం రూపొందించబడింది.

ఆధార్‌కార్డ్‌ వినియోగదారులకు మరో గుడ్‌న్యూస్‌. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ వినియోగదారుల కోసం మరో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లోనే ఆధార్ వివరాలను సురక్షితంగా భద్రపరచుకోవడంతో పాటు, అవసరమైన సమాచారాన్ని సులభంగా పంచుకునేందుకు ఈ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు UIDAI తెలిపింది. ఈ కొత్త యాప్‌తో ఇకపై భౌతికంగా ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని, ఇది పూర్తిస్థాయి పేపర్‌లెస్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంది. ఈ యాప్‌లో పలు ఆకర్షణీయమైన ఫీచర్లను పొందుపరిచారు. ముఖ్యంగా, ఒకే డివైజ్‌లో కుటుంబ సభ్యులందరి ఆధార్ వివరాలను కూడా భద్రపరచుకునే వెసులుబాటు కల్పించారు. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫేస్ అథెంటికేషన్ ద్వారా లాగిన్ అయ్యే సౌకర్యం కల్పించారు. తమ ఆధార్ వివరాలను ఇతరులతో పంచుకోవాల్సి వచ్చినప్పుడు, కేవలం అవసరమైన సమాచారాన్ని మాత్రమే పంపే అవకాశం కూడా ఇందులో ఉంది. బయోమెట్రిక్ వివరాలను లాక్ , అన్‌లాక్ చేసుకునే ఆప్షన్, ఆధార్ కార్డు చివరిసారిగా ఎక్కడ ఉపయోగించారో తెలుసుకునే హిస్టరీని కూడా ఇందులో చెక్‌చేసుకోవచ్చు. అయితే, ప్రస్తుతం వాడుకలో ఉన్న ‘ఎం-ఆధార్’ యాప్‌కు ఇది ప్రత్యామ్నాయం కాదని UIDAI స్పష్టం చేసింది. ఎం-ఆధార్‌లో లభించే డిజిటల్ కార్డు డౌన్‌లోడ్, పీవీసీ కార్డు ఆర్డర్, మొబైల్/ఈ-మెయిల్ వెరిఫికేషన్ వంటి సేవలు ఈ కొత్త యాప్‌లో ఉండవు. కేవలం ఆధార్ డేటాను సురక్షితంగా నిల్వ చేయడం, షేర్ చేయడం కోసం మాత్రమే దీనిని తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాక, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి, ఓటీపీ, ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. అనంతరం, భద్రత కోసం ఒక పిన్ నంబర్‌ను సెట్ చేసుకుని యాప్‌ను ఉపయోగించవచ్చు. ఈ కొత్త యాప్‌తో ఆధార్ సేవలు మరింత సులభంగా, సురక్షితంగా మారతాయని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై విమానాలకు ఇంధనంగా వంటనూనె !!

వేల కోట్ల వ్యాపారాలకు వారసుడు.. అయినా రాత్రిళ్లు క్యాబ్ నడుపుతూ

రెండు చేతులూ లేకపోయినా బైక్‌పై దూసుకెళ్లిన..

రైలు కదిలిపోతోంది.. నా పైసలు ఇచ్చెయ్‌ అన్నా.. ప్లీజ్‌

వేగంగా దూసుకెళ్తున్న కారు.. సైడ్ మిర్రర్ నుంచి సైలెంట్‌గా వచ్చిన పాము.. కట్ చేస్తే