తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత పానిక్ బయ్యింగ్ వల్ల తాత్కాలికంగా ఏర్పడింది. రాష్ట్రంలో తగినంత ఇంధనం నిల్వ ఉందని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్షించి, సమస్యను వెంటనే పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బారులు తీరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చమురు కొరత ఉందనే వార్తలతో జనం ఒక్కసారిగా బంకుల వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తుండటంతో బంకుల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతోంది. అసలు ఒక్కసారిగా ఇంధన సమస్య రావడానికి కారణమేంటి? సమస్యపై ప్రభుత్వం తీసుకుంటున్న అత్యవసర చర్యలేంటి? ప్రధాన నగరాల్లో పరిస్థితిని గమనిస్తే..విశాఖపట్నంలో డీజిల్ కొరత అనే వదంతులతో వాహనదారులు బంకుల వద్దకు పోటెత్తారు. షీలా నగర్ వంటి శివారు ప్రాంతాల్లో నిల్వలు నిండుకోగా, సాలిగ్రామపురం బంకుల వద్ద అర కిలోమీటర్ మేర కార్లు, ఆటోలు క్యూ కట్టాయి. దీనిపై జేసీ విద్యాధరి ఏం చెప్పారంటే.. జిల్లాలో తగినంత స్టాక్ ఉందని, బ్లాక్ మార్కెట్ లేదా అక్రమ నిల్వలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే బంకుల వద్ద రెవెన్యూ, పోలీసు బృందాలను నిరంతరం పర్యవేక్షణకు ఉంచుతామని తెలిపారు. మరోవైపు, విజయవాడలోనూ మండుటెండలో వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. రద్దీని అదుపు చేయడానికి బంకు యజమానులు టూ వీలర్లకు రూ. 200, కార్లకు రూ. 1500, భారీ వాహనాలకు రూ. 5000 వరకు మాత్రమే పెట్రోల్, డీజిల్ పోస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పెట్రోల్ కష్టాలు గొడవలకు దారితీశాయి. క్యూలైన్లలో వేచి ఉన్న వాహనదారుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బంకుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా బంకుల్లో ఇప్పటికే ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయి. అక్కడక్కడ ఉన్న బంకుల్లో కూడా బైకులకు పరిమితంగానే పెట్రోల్ ఇస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక…నెల్లూరు జిల్లాలో కూడా పెట్రో కష్టాలు కొనసాగుతుండటంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్యాంకర్లు త్వరగా వచ్చేలా ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు. అటు కలెక్టర్ హిమాన్షు శుక్లా కూడా బంకుల్లో స్టాక్ బోర్డులు ప్రదర్శించాలని, ట్యాంకర్లు సోమవా3రం సాయంత్రంలోపు బంకులకు చేరుకుంటాయని భరోసా ఇచ్చారు. నూజివీడులో టీవీ9 కథనాలతో స్పందించిన సబ్ కలెక్టర్ వినూత్న… హనుమాన్ జంక్షన్ రోడ్డులోని ఇండియన్ ఆయిల్ బంకును తనిఖీ చేశారు. అత్యవసరమైన 108 వాహనానికి కూడా డీజిల్ పోయడానికి నిరాకరించిన బంకు నిర్వాహకుడిపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర సర్వీసులకు ఆయిల్ ఇవ్వకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని సబ్ కలెక్టర్ గట్టిగా హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్వయంగా బంకులను సందర్శించారు. జిల్లాలో ఇంధన సరఫరా ఇప్పటికే ప్రారంభమైందని, ప్రజలు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం వల్లే తాత్కాలిక ఇబ్బందులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ సప్లయర్స్ నుండి ట్యాంకర్లు లోడ్ అయ్యాయని, రాత్రి కల్లా సాధారణ స్థితి నెలకొంటుందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా కొండపల్లి చమురు కేంద్రాలను సందర్శించి నిల్వలపై క్లారిటీ ఇచ్చారు. జిల్లాలో అవసరానికి మించి 10% అదనంగా స్టాక్ ఉందని, కేవలం ‘పానిక్ బయ్యింగ్’ వల్లే రద్దీ పెరుగుతోందని ఆయన వివరించారు. ఎప్పుడూ రూ. 200 పెట్రోల్ పోయించుకునే వారు కూడా భయంతో వేల రూపాయల ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల సాధారణం కంటే 30% అమ్మకాలు పెరిగాయని తెలిపారు. తనపల్లి ఐఓసీఎల్ బంకు యజమాని రాజేష్ రెడ్డి.. ఈ క్లిష్ట సమయంలో వాహనదారులకు అండగా నిలిచారు. ఉదయం నుంచే తన బంకుకు వస్తున్న ద్విచక్ర వాహనదారులకు ఒక్కొక్కరికి ఒక లీటర్ పెట్రోల్ చొప్పున ఉచితంగా పంపిణీ చేసి పెద్దమనసు చాటుకున్నారు. అంతేకాదు.. మండుటెండలో క్యూలో నిలబడుతున్న ప్రజల దాహం తీర్చేందుకు అర లీటర్ వాటర్ బాటిల్‌ను కూడా ఫ్రీగా అందించారు. అటు అనంతపురంలో కలెక్టర్ ఆనంద్, కడప కలెక్టర్ శ్రీధర్, నంద్యాల కలెక్టర్ రాజకుమారి స్వయంగా బంకులను తనిఖీ చేసి స్టాక్ వివరాలను ఆరా తీశారు. నిబంధనలు అతిక్రమించే బంకులపై ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద కేసులు పెట్టి సీజ్ చేస్తామని వారు గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయిల్ కంపెనీలు ఉన్నపళంగా క్రెడిట్ సౌకర్యాన్ని నిలిపివేయడం వల్ల రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందని, ఇది ప్రజలను ఇబ్బంది పెట్టడమేనని సీఎం అన్నారు. ఆయిల్ కంపెనీల అసంబద్ధ నిర్ణయాల వల్ల సామాన్యులు ఇబ్బందిపడితే, వారి అనుమతులపై పునరాలోచన చేయాల్సి వస్తుందని సీఎం హెచ్చరించారు. పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదని, వెంటనే ఇంధన సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆదేశించారు. ఇంధన సరఫరాను పర్యవేక్షించడానికి, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి జిల్లా కలెక్టర్లు, టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ 3 గంటలకు ఒకసారి ఆర్‌టీజీ సెంటర్ ద్వారా నివేదిక ఇవ్వాలని సూచిస్తూ, సాయంత్రం లోపు పరిస్థితిని పూర్తిగా చక్కదిద్దాలని అధికారులకు స్పష్టమైన గడువు విధించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సమస్యపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో కొన్ని తాత్కాలిక అంతరాయాలు ఉన్న మాట నిజమేనని.. అయితే దీనివల్ల ఎక్కడా రవాణా సేవలు ఆగిపోకూడదని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరఫరాను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆయన భరోసా ఇచ్చారు. మరోవైపు, తమ వద్ద 4 నుంచి 6 రోజులకు సరిపడా డీజిల్ స్టాక్ రెడీగా ఉందని ఏపీఎస్ఆర్టీసీ ఈడీ రవివర్మ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల బస్సులు నిరంతరాయంగా నడుస్తున్నాయని, ఎక్కడా సర్వీసులు నిలిచిపోలేదని ఆయన వివరించారు. రాష్ట్రంలో చమురు పరిస్థితిపై సివిల్ సప్లైస్ కమిషనర్ కన్నబాబు టీవీ9 ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని, ప్రజలు అనవసరంగా ‘పానిక్’ అవ్వడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన వివరించారు. ఆదివారం సప్లై కొంత ఆలస్యమైందని, సోమవారం సాయంత్రం కల్లా అన్ని బంకులకు ఇంధనం చేరుకుంటుందని భరోసా ఇచ్చారు. డీలర్లు పెట్టిన ఇండెంట్ ప్రకారం సప్లై చేయాలని ఆయిల్ కంపెనీలకు ఆదేశాలిచ్చామని, క్రెడిట్ సమస్యల పైన కూడా వారితో చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇటు తెలంగాణలోనూ పెట్రోల్ డీజిల్ దొరకక వాహనదారులు సతమతమయ్యారు. హైదరాబాద్ నగరవాసులు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు ఎగబడ్డారు. అల్వాల్, తిరుమలగిరి, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో జనం భారీగా క్యూ కట్టడంతో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదని, కేవలం ‘పానిక్ బయ్యింగ్’ వల్ల తాత్కాలిక సరఫరా సమస్యలు తలెత్తుతున్నాయని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. క్యాన్లు, బాటిళ్లలో పెట్రోల్ విక్రయించడంపై పోలీసులు కఠిన నిషేధం విధించారని అధికారులు వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ప్రజలు ఆందోళన చెంది, అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం వల్లే తాత్కాలిక కొరత ఏర్పడిందని ఈ సందర్భంగా అధికారులు ఆయనకు తెలిపారు. వీలున్నంత త్వరగా డిమాండ్‌కు తగినంత సరఫరా అయ్యేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. మరోవైపు, ఈ సమస్యపై రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఏపీలో ఉన్న సమస్యను చూపిస్తూ సోషల్ మీడియాలో కొందరు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇంధన నిల్వలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తోందని, అదనపు ట్యాంకర్ల ద్వారా బంకులకు నిరంతరాయంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పినపాక వంటి మండలాల్లో బంకులు మూతపడటంతో పారిశ్రామిక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం పడింది. సింగరేణి, భద్రాద్రి పవర్ ప్లాంట్, ఐటీసీ కార్మికులు పెట్రోల్ లేక విధులకు హాజరు కాలేకపోతున్నారు. ఇటు వనపర్తి జిల్లా పెబ్బేరులో కూడా పరిస్థితి తీవ్రంగా ఉండటంతో.. ఘర్షణలు జరగకుండా పోలీసుల పహారా నడుమ పెట్రోల్, డీజిల్ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి మెదక్, సూర్యాపేట జిల్లాల్లో కూడా పెట్రోల్ కష్టాలు కొనసాగుతున్నాయి. ‘పవర్ పెట్రోల్’ కొనుగోలు చేస్తేనే సాధారణ పెట్రోల్, డీజిల్ ఇస్తామని చమురు కంపెనీలు చెబుతున్నట్లు పెట్రోల్ బంకుల యాజమానులు చెబుతున్నారు. ఆదివారం సెలవు దినం కావడం వల్ల సరఫరాలో జాప్యం జరిగిందని, సోమవారం రాత్రికి తగినంత సరఫరా అయ్యే అవకాశముందని వారు తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరత వచ్చింది కేవలం సరఫరాలో జాప్యంవ వల్లే. అందుకే ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగడంతో.. సోమవారానికి సరఫరా మెరుగుపడుతుంది. కొనుగోలుదారులు పానిక్ కాకుండా అవసరమైనంత మేరకే కొనుగోలు చేస్తే.. ఇతరులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని అధికారులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
122 ఏళ్ల తర్వాత వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజం! గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం
పౌడర్ రాసుకుంటేనే కూలీ.. లేదంటే..!
Director Shankar: రజినీకి విలన్‌గా డైరెక్టర్ శంకర్
నెగెటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్‌లో దుమ్ములేపుతున్న ‘మైఖేల్’
Monalisa Bhosale: ప్రేమ – పెళ్లి – ఇప్పుడు గర్భవతి !! షాకు మీద షాకిస్తున్న మోనాలిసా