Cyclone Alert: తరుముకొస్తున్న తుఫాన్‌.. తీరం దాటేది అక్కడే

Updated on: Oct 25, 2025 | 8:51 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం ప్రభావంతో మరో నాలుగైదు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

సముద్ర మట్టానికి సగటు 5.8 కి.మీ ఎత్తులో విస్తరించిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం అల్పపీడనంగా మారుతుందని… తర్వాత 24 గంటల్లో పశ్చిమ-ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తీవ్ర అల్పపీడనం వచ్చే సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు. దీంతో సోమ, మంగళవారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో.. శుక్రవారం ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా,నంద్యాల,కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక.. తెలంగాణలో నాగర్ కర్నూల్,నారాయణపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, సిద్దిపేట, మహబూబాబాద్,జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం, జనగాం, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. మొత్తం 22 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అల్పపీడనాల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు మరి కొద్ది రోజులు వేటకు వెళ్ళరాదని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దహాడీ వేడుకల్లో.. వాతల వైద్యం ఒక్క చురుకుతో.. ఏ రోగమైనా పరార్