దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి

Updated on: Aug 18, 2026 | 6:46 PM

హైదరాబాద్‌ మౌలాలీలో విషాద ఘటన చోటుచేసుకుంది. జనగామకు చెందిన 20 ఏళ్ల నర్సు మానేపల్లి మానస.. తల్లిదండ్రులతో కలిసి ప్రయాణించి తిరిగి వస్తుండగా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దిగిన అనంతరం ప్లాట్‌ఫామ్‌ మారేందుకు పట్టాలు దాటుతుండగా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆమెను ఢీకొట్టింది. తల్లిదండ్రుల కళ్లముందే కుమార్తె ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

ప్రాణాలు కాపాడే నర్సు వృత్తిలో ఉన్న ఆ యువతి జీవితం, క్షణాల వ్యవధిలో విషాదాంతమైంది. తల్లిదండ్రులతో కలిసి చేసిన సాధారణ ప్రయాణం ఆమెకు చివరి ప్రయాణంగా మారింది. జనగాం నుంచి మౌలాలి వచ్చిన 20 ఏళ్ల నర్స్ మానేపల్లి మానస..తల్లిదండ్రులు చూస్తుడంగానే రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్‌ మౌలాలీలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా నేరేడుమెట్లకు చెందిన ప్రకాశ్‌, జ్యోతి దంపతులు కొంతకాలంగా మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె మానస నెల రోజుల క్రితమే నర్సు శిక్షణ పూర్తి చేసుకుంది. కుటుంబ సభ్యులు కలిసి జనగామలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి.. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణమయ్యారు. మౌలాలీలో రైలు దిగిన అనంతరం మానస కుటుంబ సభ్యులు ప్లాట్‌ఫామ్ నంబర్-2 నుంచి ప్లాట్‌ఫామ్ నంబర్-1 వైపు వెళ్లేందుకు వారు పట్టాలు దాటుతున్నారు. అదే సమయంలో విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు దూసుకు వస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు దాటుతున్న మానసను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్లముందే కన్నకూతురు విగతజీవిగా మారిపోవడం చూసి ఆ తల్లిదండ్రుల ఆక్రందనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. గోల్కొండ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన తర్వాత మానస అకస్మాత్తుగా పట్టాల వైపు ఎందుకు వెళ్లింది? వందేభారత్ రాకను ఎందుకు గమనించలేకపోయిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెప్పపాటులో జరిగిపోయిన ఈ ప్రమాదం ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు!

అది ఇల్లా.. బంగారు గనా..! రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం

మీ చెప్పులు పోయాయా.. అయితే చాట్‌ జీపీటీని అడగండి.. ఇట్టే దొరికేస్తాయ్‌

Loading...
Unable to load recommendations.
Follow Us