ఈ విషయాన్ని ఇంకా పొడిగించాలనుకోవడం లేదు: బాబుకు వంశీ మరో లేఖ

తన లేఖకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించడంపై వల్లభనేని వంశీ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రెండోసారి బాబుకు లేఖ రాసిన వంశీ అందులో.. ‘‘పార్టీలో నా సేవల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. నా ఆవేదనను అర్థం చేసుకొని లేఖ రాసినందుకు మీకు కృతజ్ఞతలు. ఎలాంటి దాపరికాలు లేకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మీ ముందుంచాను. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా 2006 నుంచి మీరు చెప్పిన విధంగా, మీ మార్గదర్శకంలోనే నడిచాను’’ అని ఈ […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:27 am, Mon, 28 October 19

తన లేఖకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించడంపై వల్లభనేని వంశీ కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రెండోసారి బాబుకు లేఖ రాసిన వంశీ అందులో.. ‘‘పార్టీలో నా సేవల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. నా ఆవేదనను అర్థం చేసుకొని లేఖ రాసినందుకు మీకు కృతజ్ఞతలు. ఎలాంటి దాపరికాలు లేకుండా నా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని మీ ముందుంచాను. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా 2006 నుంచి మీరు చెప్పిన విధంగా, మీ మార్గదర్శకంలోనే నడిచాను’’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

‘‘ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉన్నా మీ ఆదేశాలతోనే తొలిసారి విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయినా ఐదేళ్ల విలువైన కాలం వృథా అయ్యిందని ఏనాడు బాధపడలేదు. ఓ సీనియర్‌ నేతపై, ఐపీఎస్‌ అధికారిపై, ఇలా ఎన్నోసార్లు నా పోరాటం సాగింది. అప్రాజాస్వామిక విధానాలపై నా పోరాటం ఎప్పుడూ ఆపలేదు. 2019 ఎన్నికల్లో పోటీచేయకుండా ఆపేందుకు ప్రత్యర్థులు ఎలాంటి ఒత్తిడి తెచ్చారో మీకు తెలుసు, ఆ విషయాన్ని ఇంకా పొడిగించి భిన్నాభిప్రాయాలకు తావివ్వడం నాకు ఇష్టం లేదు. ప్రభుత్వం హింసను ఎదుర్కొనేందుకు మీ అడుగుజాడల్లో నడిచాను. అన్యాయాన్ని ఎదుర్కొనడంలో మీ మద్దతును గుర్తించుకుంటాను’’ అని వంశీ తెలిపారు.

‘‘జిల్లా పార్టీ మద్దతు లేకపోయినా రాజ్యాంగబద్ధమైన సంస్థల సాయంతో అన్యాయాలపై పోరాడాను. కనపడే శత్రువుతో యుద్ధం చేయడం తేలిక, కానీ కనపడని శత్రువుతో యుద్ధం చేయడం కష్టం. అయితే నాకు అండగా ఉంటానన్నందుకు మీకు నా కృతజ్ఞతలు. తెలిసో తెలియకో ఎక్కడైనా నా పరిధి దాటి ప్రవర్తిస్తే మన్నిస్తారని ఆశిస్తున్నాను’’ అని సోషల్ మీడియా ద్వారా వల్లభనేని రెండోసారి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు.

అయితే స్థానిక వైసీపీ నేతలు, కొంతమంది ప్రభుత్వ అధికారులు కలిసి వేధింపులకు గురిచేస్తున్నారని.. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని వల్లభనేని వంశీ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తన ఎమ్మెల్యే పదవితోపాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడుకు ఆయన లేఖ రాసిన విషయం తెలిసిందే.