పొగ మంచు మనుషులు ప్రాణాలను బలి తీసుకుంటోంది. రోజురోజుకీ తగ్గుతోన్న ఉష్ణోగ్రత కారణంగా ఉదయం వాహనాలు నడపాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. మొన్నటి మొన్న వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీకొన్న సంఘటన చూశాం. తాజాగా ఇలాంటి ఓ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఓ యువకుడు ట్రక్కు ఢీకొని మృతి చెందాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని పెట్రోల్ పంపు నుంచి బయటకు వస్తున్న ఓ టారీ ఢీకొట్టింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. వీడియో చూస్తుంటే ప్రమాదానికి పొగ మంచు కారణమనిపిస్తోంది. డ్రైవర్ ఎదురుగా ఉన్న వ్యక్తిని గమనించకపోవడం వల్లే, ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు.
బాధితుడిని షమీమ్ ఖాన్‌గా గుర్తించారు. తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న సమయంలో లారీ డ్రైవర్, అదే సమయంలో రోడ్డు దాటుతోన్న షమీమ్ ఖాన్‌ను గుర్తించలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా ఢీకొట్టాడు. పక్కన ఉన్న వారు ఒక్కసారిగా అరవడంతో డ్రైవర్ లారీని ఆపేశాడు. తీవ్రంగా గాయాలైన షమీమ్ ఖాన్‌ను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలోనే షమీమ్ ఖాన్ మరణించినట్లు వైద్యులు తెలిపారు.
credit Twitter (Bittu Pandit)
పొగ మంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతోన్న క్రమంలోనే పొగ మంచుతో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం పూట వాహనాలు నడిపే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వాహనాలను వీలైనంత నెమ్మదిగా నడపాలని, ఉదయం పూట కూడా లైట్స్‌ను వేయాలని చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..