దానాల్లో అన్నదానానికి మించిన గొప్పది మరొకటి లేదంటారు చాలామంది. అయితే దీనిని చేతల్లో చూపేవారు చాలా తక్కువమందే ఉంటారు. ఈ క్రమంలో కోల్‌కతాకి చెందిన ఓ మహిళ తన సోదరుడి పెళ్లిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఆకలితో ఉన్నవారికి పంచిపెట్టారు. ఇది చాలామంది చేస్తున్నదే కదా అని అనుకోవచ్చు..కానీ ఆమె అర్ధరాత్రి వేళ ఏకంగా రైల్వేస్టేషన్‌కి వెళ్లి స్వయంగా అనాథలకు భోజనం వడ్డించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పెద్ద మనసుతో ఆమె చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా మన దేశంలో పెళ్లిళ్లంటే ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నోరూరించే వంటకాలతో విందులు, సంగీత్‌లు, బరాత్‌లు, మెహెందీలు, బహుమతులు..ఇలా ఎన్నో ఉంటాయి.
మానవత్వం ఇంకా ఉందని నిరూపించారు..
చాలా పెళ్లి వేడుకల్లో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు మిగిలిపోవడం మనం చూస్తూనే ఉంటాం. వాటిని వృథాగా పోనివ్వకుండా మరుసటి రోజున వాటిని అవసరమైన వారికి అందజేస్తుంటాం. ఈక్రమంలోనే కోల్‌కతాకి చెందిన పాపియ కర్ అనే మహిళ తన సోదరుడి పెళ్లిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పెద్ద పెద్ద బకెట్లు, పాత్రల్లో నింపి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కోల్‌కతా సబర్బన్ రైల్వే స్టేషన్ రాణాఘాట్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న అనాథలందరినీ పిలిచి పేపర్ ప్లేట్లలో స్వయంగా అందరికీ కడుపు నిండా భోజనం వడ్డించారు. ఈ క్రమంలో సంప్రదాయ దుస్తుల్లో ఓ రైల్వే ప్లాట్‌ఫాంపై కూర్చొని అనాథలకు అన్నం వడ్డిస్తో్న్న ఆ మహిళ ఫొటోలను అక్కడే ఉన్న నీలాంజన్ మండల్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాల్లో బంధించాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ‘ఇలాంటి వారిని చూసినప్పుడే ఈ లోకంలో ఇంకా మానవత్వం ఉందన్న నమ్మకం కలుగుతోంది. ఆమె చాలామంచి పనిచేసింది. మిగతా వారందరూ ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి. అన్నదానం కంటే మించింది మరొకటి లేదు’ అంటూ ఆ మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.