Maharashtra: ఈ లోకంలో తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదని ఎన్నోసార్లు నిరూపితం అయ్యింది. తల్లి తన పిల్లలను కాపాడుకునేందుకు.. తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. ఎన్నోసందర్భాల్లో ఇది చూశాం. అయితే, మహారాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. ఓ తల్లి తన కూతురును రక్షించుకునేందుకు క్రూర మృగమైన చిరుత పులితో పోరాడింది. చిరుతను బెదిరించి.. ఐదేళ్ల పసిబిడ్డ ప్రాణాలను రక్షించుకుంది. ఈ ధీనవనితకు సంబంధించిన వార్త చాలా ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళితే.. చంద్రాపూర్ జిల్లా కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జునోనా గ్రామానికి చెందిన అర్చన మెష్రామ్ తన ఐదేళ్ల కూతురుతో గ్రామ శివార్లకు వెళ్తోంది. ఆ సమయంలో హఠాత్తుగా వచ్చిన చిరుత పులి.. తల్లి వెనుక నడుస్తున్న కూతురుపై దూకింది. చిరుతను చూసిన మహిళ తొలుత భయపడిపోయింది. కానీ తన బిడ్డ ప్రాణాపాయంలో ఉండటంతో ధైర్యం తెచ్చుకుంది. పక్కనే ఉన్న ఓ వెదురు కర్రను తీసుకుని ఆ చిరుత కొట్టింది. నోట కరుచుకున్న బాలికను వదలేవరకు ఆ తల్లి చిరుతను చితక్కొట్టింది. మహిళ దాడికి బెదిరిపోయిన చిరుత పులి.. ఆ చిన్నారిని వదిలిపెట్టి అడవిలోకి పారిపోయింది.
అయితే, చిరుత దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాధిత బాలికను చంద్రపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ చిన్నారికి సోమవారం నాడు నాగ్‌పూర్ ప్రభుత్వాస్పత్రిలో శస్త్ర చికిత్స చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారి వైద్యానికి అయ్యే ఖర్చును అటవీశాఖ తరఫున అందజేస్తున్నారు. కాగా, ఈ ఘటన జూన్ 30వ తేదీన చోటు చేసుకోగా.. తాజాగా అధికారులు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Also read:
Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ‘దళిత సాధికారత’ పథకంలో కీలక మార్పు..