AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్తతో విడాకులు తీసుకున్నా అత్తతో అనుబంధం! 1,000 కి.మీ. వెళ్లి మరీ ఇంటికి తెచ్చుకున్న కోడలు!

సాధారణంగా భార్యాభర్తల మధ్య విడాకులు తీసుకున్న తర్వాత వారి కుటుంబాల మధ్య సంబంధాలు దూరమవుతుంటాయి. కానీ చైనాకు చెందిన ఓ మహిళ భర్తతో విడాకులు తీసుకుని 12 ఏళ్లు గడిచినా మాజీ అత్తతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించింది. తాజాగా ఆమె చేసిన ఓ పని సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకుంటోంది. భర్త, మామ చనిపోవడంతో ఒంటరైన తన మాజీ అత్తను ఏకంగా 1,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మరీ తన ఇంటికి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

భర్తతో విడాకులు తీసుకున్నా అత్తతో అనుబంధం! 1,000 కి.మీ. వెళ్లి మరీ ఇంటికి తెచ్చుకున్న కోడలు!
Woman Brings Former Mother In Law Home 12 Years After Divorce Following Deaths Of Ex Husband And Father In Law
Sharada V
|

Updated on: Nov 04, 2026 | 10:59 PM

Share

చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లిన్ కు 20 ఏళ్ల వయసులో వివాహమైంది. అయితే పెళ్లైన ఐదేళ్లకే భర్తతో విడాకులు తీసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకుల తర్వాత దాదాపు పదేళ్ల పాటు పిల్లలు తండ్రి వద్దే పెరిగారు. ఆ సమయంలో లిన్ మాజీ అత్తమామలు ఆమెతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మాజీ అత్త ఆమెను సొంత కూతురిలాగే చూసుకుంది. విడాకుల తర్వాత కూడా లిన్ క్షేమ సమాచారాలు ఆరా తీసేది. హెనాన్‌లో లిన్ చేస్తున్న ఫుడ్‌ బిజినెస్‌ గురించి తెలుసుకుని, మరీ ఎక్కువగా కష్టపడొద్దని సూచించేది.

భర్త, మామ మరణంతో ఒంటరిగా మాజీ అత్త

లిన్ మాజీ మామ 2024లో అనారోగ్యంతో మరణించారు. ఆ తర్వాత గతేడాది ఆమె మాజీ భర్త కూడా కన్నుమూశాడు. దీంతో ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో ఉన్న మాజీ అత్త ఒంటరిగా మిగిలిపోయింది. ఆమెకు సొంతంగా ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారంతా ఆమెను తమ ఇళ్లకు తీసుకెళ్లి చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ తన భర్త, కుమారుడితో కలిసి ఎన్నో ఏళ్లుగా నివసించిన గ్రామంలోని ఇంటిని విడిచిపెట్టడానికి ఆమె ఇష్టపడలేదు. అయితే లిన్ ఇద్దరు పిల్లలు ఇప్పుడు తల్లితో కలిసి హెనాన్‌లో నివసిస్తున్నారు. లిన్ తన ప్రస్తుత భర్తతో అక్కడే ఉంటోంది. దీంతో మాజీ అత్త గ్రామంలో ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలిసిన లిన్ ఆమెను అలా ఒంటరిగా వదిలేయకూడదని నిర్ణయించుకుంది.

1,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మరీ

మాజీ అత్తను తన దగ్గరకు తీసుకురావాలని దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు వెళ్లింది. అక్కడి నుంచి 1,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆమెను తన ఇంటికి తీసుకొచ్చింది. అయితే మొదట్లో మాజీ అత్త అందుకు అంగీకరించలేదు. తన వల్ల లిన్ కుటుంబానికి ఇబ్బంది కలుగుతుందని, తాను వారికి భారం అవుతానని ఆందోళన చెందింది. కానీ లిన్ మాత్రం ఆమెను ఒప్పించే ప్రయత్నం ఆపలేదు. చివరకు ఆమెను తనతో పాటు హెనాన్‌కు తీసుకురావడంలో విజయం సాధించింది. తన మాజీ అత్తను ఇప్పటికీ ‘అమ్మ’ అనే పిలుస్తానని లిన్ తెలిపింది. విడాకులు తీసుకున్నంత మాత్రాన బంధాలు తెగిపోవని, తనకు గతంలో లభించిన ప్రేమ, ఆదరణకు తిరిగి కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పింది.

ప్రస్తుత భర్త సహకారం.. తల్లి మద్దతు

ఈ నిర్ణయం తీసుకోవడంలో తన ప్రస్తుత భర్త ఎంతో సహకరించారని లిన్ తెలిపింది. ఆయన తన ఆలోచనను అర్థం చేసుకుని మద్దతుగా నిలిచారని చెప్పింది. అంతేకాదు, లిన్ తల్లి కూడా ఈ నిర్ణయాన్ని అభినందించింది. తన కుమార్తెను మాజీ అత్తమామలు ఎంతో ప్రేమగా చూసుకున్నారని, కొన్నిసార్లు తనకంటే ఎక్కువగా ఆదరించారని ఆమె పేర్కొంది. ఇప్పుడు తన కుమార్తె, మనవళ్లతో కలిసి మాజీ అత్త సంతోషంగా ఉండటం తనకు ఆనందంగా ఉందని చెప్పింది. లిన్ మాజీ అత్త కూడా తన మనవళ్లతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నట్లు సమాచారం. ఆమెకు ఇష్టం ఉన్నంతకాలం తమతోనే ఉండవచ్చని, తాత్కాలికంగా అయినా లేదా శాశ్వతంగా అయినా తమ ఇంట్లో ఉండేందుకు స్వాగతం పలుకుతున్నామని లిన్ చెప్పింది.

సోషల్ మీడియాలో ప్రశంసలు

లిన్ చేసిన పనిపై చైనా సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విడాకుల తర్వాత కూడా ఇంతటి అనుబంధాన్ని కొనసాగించడం గొప్ప విషయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘మనుషుల మధ్య బంధాలు పరస్పర ప్రేమ, గౌరవాలపై ఆధారపడి ఉంటాయి. మనం ఇతరులను మంచిగా చూసుకుంటే, వారు కూడా మనల్ని అలాగే చూసుకుంటారు,’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరో వ్యక్తి స్పందిస్తూ.. 70 ఏళ్ల వయసులో ఓ మహిళ తన సొంత ఊరిని వదిలి ఇంత దూరం ప్రయాణించి మాజీ కోడలితో కలిసి ఉండేందుకు అంగీకరించిందంటే వారిద్దరి మధ్య ఎంతటి అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. విడాకులతో భార్యాభర్తల బంధం ముగిసినా.. ప్రేమతో ఏర్పడిన కుటుంబ అనుబంధాలు మాత్రం జీవితాంతం కొనసాగవచ్చని లిన్ నిరూపించింది.

Follow Us