ప్రస్తుత కాలంలో ఏది నిజమైన ప్రేమ, ఏది ఫేక్ అనేది తేల్చుకోవడం చాలా కష్టం. కానీ, నిజమైన ప్రేమను పొందిన వారు మాత్రం జీవితాంతం సంతోషంగా ఉంటారు. ఒకరికొకరు కలిసిమెలిసి హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఇదిలాఉంటే.. ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు స్నేహితులవ్వడం క్షణకాలం కూడా పట్టడం లేదు. అంతే తొందరగా విడిపోవడం కూడా జరిగిపోతుంది. కొన్ని నెలలు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. ఎంత త్వరగా కనెక్ట్ అవుతారో.. అంతే త్వరగా డిస్‌కనెక్ట్ అవుతారు. కొన్నిసందర్భాల్లో ప్రియుడు బ్రేకప్ చెబితే.. మరికొన్ని సందర్భాల్లో ప్రియురాలు బ్రేకప్ చెప్తుంది. ఇక ఇదే సమయంలో కొందరు ప్రేమికులు మాత్రం తాము ప్రేమించిన వారిని అంత సులభంగా మర్చిపోలేకపోతారు. ఈ క్రమంలో ఎలాగైనా తమ ప్రియుడు, ప్రియురాలిని తిరిగి దక్కించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. తాజాగా ఓ అమ్మాయి కూడా తన మాజీ ప్రియుడిని మర్చిపోలేక.. తిరిగి అతన్ని సొంతం చేసుకునేందుకు వింత ప్రయత్నం చేసింది. కానీ, ఆ ప్రయత్నం కాస్తా బెడిసికొట్టి ఆమె మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఇంతకీ ఆ భగ్న ప్రేమికురాలు తన ప్రియుడిని దక్కించుకునేందుకు ఏం చేసిందో తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెడతారు.
వివరాల్లోకెళితే.. చైనాకు చెందిన ఓ అమ్మాయికి ఆమె ప్రియుడు బ్రేకప్ చెప్పాడు. దాంతో అతన్ని తిరిగి దక్కించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. అయితే, ఆ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో ఇక లాభం లేదనుకుని ఓ మంత్రగాడిని ఆశ్రయించింది. తన బాధను అతనికి చెప్పుకుంది. తనను, తన ప్రియుడిని ఎలాగైనా కలపాలని వేడుకుంది. అయితే, అమ్మాయి అమాయకత్వాన్ని గ్రహించిన ఆ మాయలోడు.. అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేశాడు. అమ్మాయిని తన ప్రియుడితో కలుపుతానంటూ ఊదరగొట్టాడు. నమ్మించాడు. అయితే, ఇందుకోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని, కొంత డబ్బు కూడా ఖర్చు అవుతుందని చెప్పాడు. ప్రియుడికంటే తనకు ఎక్కువ మరేదీ లేదనుకున్న ఆ అమ్మాయి.. మాయలోడు చెప్పిన అన్నింటికీ ఓకే చెప్పేసింది.
మంత్రగాడు.. అమ్మాయిని రహస్యంగా ఒక ప్రదేశానికి రమ్మని సూచించాడు. కొవ్వత్తులు, మంత్రతంత్రాలు చేసేందుకు అవసరమైన ఇతర వస్తువులను కూడా తీసుకురావాలని లిస్ట్ రాసిచ్చాడు. అలాగే కొంత డబ్బు కూడా తీసుకురావాలని సూచించాడు. ఆ ఎడ్డి ప్రేమికురాలు.. అతను చెప్పినట్లుగా వస్తువులన్నీ తీసుకొచ్చి మాయలోడికి అప్పగించింది. రూ. 1.5 లక్షలు డబ్బు కూడా అప్పగించింది. ఇంకేముంది.. తనకు కావాల్సిన డబ్బు వచ్చేసింది. ఆ అమ్మాయిని నమ్మించేందుకు ఏదో ఒకటి చేయాలన్నట్లుగా మంత్రాలు చేస్తూ నమ్మించాడు. కొన్ని రోజుల పాటు ఇలా చేస్తూ.. డబ్బులు తీసుకుంటూ.. ఉన్నట్లుండి ఓరోజు కనిపించకుండా పోయాడు. అతని ఆచూకీ కోసం అమ్మాయి ఎంత ప్రయత్నించినా దొరకలేదు. దాంతో తాను మోసపోయానని గ్రహించిన అమ్మాయి.. విషయాన్ని తన స్నేహితులకు తెలియజేసింది. చేసేదేమీ లేక వారు ఆమెను ఓదార్చారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..