
నేపాల్‌లోని బఝాంగ్ జిల్లాలో ఓ కుక్కను వంతెనపై నుంచి సేతి నదిలోకి విసిరేస్తున్నట్లుగా కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలు నెటిజన్లలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన సెప్టెంబర్ 2న బఝాంగ్‌లోని జైపృథ్వీ మున్సిపాలిటీ పరిధిలోని చైన్‌పూర్ ప్రాంతంలో ఉన్న పంకోటక్ వంతెన వద్ద జరిగినట్లు తెలుస్తోంది. 10, 11 వార్డుల సరిహద్దుకు సమీపంలో ఉన్న బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన బఝాంగ్ నివాసి నబిన్ పాండే ఈ ఘటనను గమనించి వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పాండే తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ కుక్కను వెంట తీసుకుని వంతెన వద్దకు వచ్చింది. అనంతరం దానిని సేతి నదిలోకి విసిరేసింది. తాను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె వినలేదని నబిన్ పాండే చెప్పారు. ఓ జాతర సందర్భంగా ఫొటోలు తీసేందుకు వంతెన వద్దకు వెళ్లిన సమయంలో ఈ ఘటన తన కళ్ల ముందే జరిగిందని పాండే వివరించారు. ఆ కుక్క ఎవరినో కరిచిందని మహిళ చెప్పినట్లు పాండే తెలిపారు. అయితే ఆ సమయంలో కుక్క ప్రశాంతంగా కనిపించిందని, తాను పశువైద్యం చదివిన వ్యక్తినని, చిన్నప్పటి నుంచి కుక్కలను పెంచుతున్నానని చెప్పారు. అందువల్ల మహిళ చెప్పిన కారణంపై తనకు అనుమానం కలిగిందన్నారు.
కుక్కను నదిలోకి విసిరిన తర్వాత బలమైన ప్రవాహంలో అది కొంత దూరం కొట్టుకుపోయి, ఆపై కనిపించకుండా పోయిందని పాండే పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పాండే బుధవారం ఉదయం 11:39 గంటల సమయంలో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అనంతరం వీడియో విస్తృతంగా షేర్ కావడంతో విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. బఝాంగ్ జిల్లా పోలీస్ కార్యాలయ సమాచార అధికారి దీపక్ బిష్ట్ ఘటనపై పోలీసులకు సమాచారం అందిందని, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. వీడియోలో కనిపిస్తున్న మహిళను గుర్తించేందుకు, ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం వైరల్ వీడియో ఆధారంగా ఘటనపై విచారణ కొనసాగుతోంది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
A woman was allegedly seen throwing a pet dog into the Seti River near Pankot Bridge. 😡 https://t.co/YvnfDUTABU
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 17, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..