AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ఫైవ్‌ స్టార్‌ ఉద్యోగాన్ని వదిలి.. దుబాయ్‌లో రూ. 520కి చోలే భటూరే

ఒకప్పుడు స్టార్ హోటళ్లలో వంట చేసిన చెఫ్.. ఇప్పుడు రోడ్డు పక్కన దొరికే చోలే భటూరే అమ్ముతున్నారు. అదీ దుబాయ్‌లో ! మిచెలిన్ గుర్తింపు పొందిన రెస్టారెంట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన.. ఆ ఉద్యోగాన్ని వదిలేసి సొంతంగా చిన్న ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. ప్రస్తుతం చోలే భటూరే కోసం కస్టమర్లు గంటకు పైగా క్యూలో నిలబడుతున్నారు. రోజుకు కేవలం 200 ప్లేట్లు మాత్రమే విక్రయిస్తున్నా.. ఈ చిన్న వ్యాపారం ఇప్పుడు దుబాయ్‌లో ఫుడ్ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.

Video : ఫైవ్‌ స్టార్‌ ఉద్యోగాన్ని వదిలి.. దుబాయ్‌లో రూ. 520కి చోలే భటూరే
Why This Indian Chef Quit A Michelin Kitchen To Sell Chole Bhature In Dubai
Sharada V
|

Updated on: Nov 03, 2026 | 7:52 PM

Share

రోహిణి నుంచి దుబాయ్ వరకు.. కష్టాల మధ్య మొదలైన ప్రయాణం

ప్రదీప్ ఖుల్లర్ జీవిత ప్రయాణం ఎన్నో కష్టాలతో మొదలైంది. ప్రదీప్‌కు 15 ఏళ్ల వయసులో క్యాన్సర్‌తో తండ్రి మరణించారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీద పడ్డాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆమె ఉద్యోగం చేస్తూనే టైలరింగ్ వ్యాపారం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రదీప్‌కు హోటల్ మేనేజ్‌మెంట్ చదవడం కూడా అంత సులభం కాలేదు. యూనివర్సిటీలో సీటు కోసం అవసరమైన రూ.4 లక్షలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో చదువుపై సందిగ్ధంలో పడ్డారు. ఆ సమయంలో ఓ స్నేహితుడు తన వద్ద ఉన్న అప్లికేషన్ ను ప్రదీప్‌కు ఇవ్వడంతో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరారు. 2004లో కెరీర్‌ను ప్రారంభించిన ప్రదీప్.. ఇండియన్ యాక్సెంట్, పంజాబ్ గ్రిల్ వంటి ప్రముఖ రెస్టారెంట్లలో పనిచేశారు. ఆ తర్వాత 2015లో దుబాయ్‌కు వెళ్లారు. అక్కడ కూడా తన వంట నైపుణ్యంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మిచెలిన్ గుర్తింపు ఉన్న రెస్టారెంట్‌ను వదిలి సొంత వ్యాపారం

దుబాయ్‌లోని నజారా రెస్టారెంట్‌లో ప్రదీప్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ రెస్టారెంట్‌కు మిచెలిన్ గైడ్ దుబాయ్ 2026 సెలెక్టెడ్ రెస్టారెంట్ల జాబితాలో చోటు లభించింది. అయితే ఆ గుర్తింపు వచ్చిన కొద్ది రోజులకే ప్రదీప్ తన వ్యాపార భాగస్వామి సౌభాగి వీర్‌తో కలిసి ఉద్యోగాన్ని వదిలి సొంతంగా ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. ఇద్దరూ సొంత నిధులతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అక్టోబర్ 16న దుబాయ్‌లోని ఔద్ మెథా ప్రాంతంలో ‘భటూరేవాలా’ పేరుతో టేక్‌అవే అవుట్‌లెట్ ప్రారంభించారు. ఇక్కడ ప్రధానంగా చోలే భటూరే విక్రయిస్తున్నారు. ఒక ప్లేట్ ధర 20 దిర్హామ్‌లు (రూ.520). మటన్ భటూరే, లస్సీ కూడా మెనూలో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా కూర్చుని తినేందుకు సాధారణ రెస్టారెంట్ తరహా ఏర్పాట్లు లేవు. ఎక్కువగా పార్శిల్ సర్వీసుపైనే దృష్టి పెట్టారు.

చిన్నప్పటి జ్ఞాపకమే  వ్యాపారానికి పునాది

ప్రదీప్‌కు చోలే భటూరేతో చిన్నప్పటి నుంచే ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రతి ఆదివారం కుటుంబం కోసం చోలే భటూరే కొనడానికి వీధిలోని ఓ దుకాణం ముందు క్యూలో నిలబడేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తిన్న ఆ వంటకమే ఇప్పుడు తన సొంత వ్యాపారానికి పునాదిగా మారింది. అందుకే చోలే భటూరే రుచిలో ఎలాంటి రాజీ పడకూడకూడని నిర్ణయించారు. ప్రస్తుతం భటూరేవాలాలో రోజుకు కేవలం 200 ప్లేట్లు మాత్రమే విక్రయిస్తున్నారు. అయినప్పటికీ కస్టమర్ల రద్దీ ఎక్కువగా ఉంటోంది. కొందరు తమ ఆర్డర్ కోసం గంటకు పైగా ఎదురుచూస్తున్నారు

నాణ్యత విషయంలో రాజీ పడని చెఫ్

ఈ అవుట్‌లెట్‌కు వస్తున్న కస్టమర్లు ప్రదీప్ వంటకాల రుచిని ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఒకసారి ఓ కస్టమర్ తన ఆర్డర్ కోసం గంటకు పైగా ఎదురుచూశాడు. అయితే ఆలస్యంపై అసహనం వ్యక్తం చేయకుండా ప్రదీప్‌ను కౌగిలించుకుని అభినందించాడు. ‘ఆహారం నాణ్యతను తగ్గించకండి. ఇలాగే కొనసాగించండి’ అంటూ ప్రోత్సహించాడు. ఈ మాటలు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని ప్రదీప్ గుర్తుచేసుకున్నారు. మరోవైపు కస్టమర్లు ఎంతమంది ఎదురు చూస్తున్నా ఆహార నాణ్యత విషయంలో ఆయన రాజీ పడటం లేదు. ఒకసారి మటన్ కర్రీ ఎక్కువగా ఉడికిపోవడంతో ఆ బ్యాచ్‌ను కస్టమర్లకు వడ్డించేందుకు నిరాకరించారు. బయట కస్టమర్లు ఎదురుచూస్తున్నప్పటికీ నాణ్యత సరిగా లేని ఆహారాన్ని విక్రయించడానికి ఒప్పుకోలేదు.

‘మా దగ్గర ఉన్న ఏకైక ఆస్తి ఆహార నాణ్యతే’

ఇటీవల మీరా బిజినెస్ ఎఫ్‌ఎం కార్యక్రమంలో పాల్గొన్న ప్రదీప్, సౌభాగి వీర్.. స్టార్ హోటళ్లలో పనిచేసే ఉద్యోగాల నుంచి సొంతంగా స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం ప్రారంభించే వరకు తమ ప్రయాణం గురించి వివరించారు. మొత్తానికి చిన్నప్పటి ఇష్టమైన వంటకాన్ని వ్యాపారంగా మార్చుకున్న ప్రదీప్ ఖుల్లర్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Follow Us