
హిందూ సాంప్రదాయం ప్రకారం మరణానంతరం అంత్యక్రియలలో భాగంగా శరీరాన్ని దహనం చేయడం అనూహ్యంగా వస్తున్న ఆచారం. అగ్ని దేవుడు శరీరంలోని ప్రతి భాగాన్ని దహించివేస్తాడని, అంతా బూడిదగా మారుతుందని మనమంతా భావిస్తాం. కానీ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల ప్రకారం.. సాధారణ చితి మంటల్లో మానవ శరీరంలోని అన్ని భాగాలు పూర్తిగా బూడిదగా మారదు. తీవ్రమైన వేడిని సైతం తట్టుకుని కొన్ని భాగాలు అలాగే మిగిలిపోతాయి. దీని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన శాస్త్రీయ కారణాలు, నిజాలు ఇక్కడ చూద్దాం.
శరీరాన్ని చితిపై ఉంచి నిప్పంటించినప్పుడు, అగ్ని కీలల తీవ్రతకు మొదట శరీరంలోని మృదువైన కణజాలాలు అంటే చర్మం, మాంసం, అంతర్గత అవయవాలు కాలిపోతాయి. ఆ తర్వాతే మంటల వేడి ఎముకలకు తాకుతుంది. అయితే ఎముకలు, దంతాలు పూర్తిగా కాలిపోవడానికి సాధారణం కంటే చాలా రెట్లు అధిక ఉష్ణోగ్రతలు అవసరమవుతాయి. మన సాంప్రదాయక చితి మంటల్లో ఆ స్థాయి వేడి నిరంతరాయంగా లభించదు. అందుకే దహన సంస్కారాల తర్వాత మిగిలే బూడిదలో చిన్న చిన్న ఎముక శకలాలు స్పష్టంగా కనిపిస్తాయి.
పంటి ఎనామెల్: మానవ శరీరంలోనే అత్యంత బలమైన పదార్థం ఏదైనా ఉందంటే అది పళ్లపై ఉండే బయటి పొర అయిన ఎనామెల్ మాత్రమే. సాధారణ అగ్నిప్రమాదాల్లో లేదా చితి మంటల్లో ఉండే ఉష్ణోగ్రతలకు ఇది అస్సలు లొంగదు. పూర్తి దహన ప్రక్రియ తర్వాత కూడా దంతాలు పూర్తిగా కాలిపోకుండా మిగిలిపోతాయి.
తోక ఎముక: వెన్నెముక చివరన ఉండే తోక ఎముక చాలా గట్టిగా ఉంటుంది. అత్యధిక మంటల్లో కూడా ఇది పూర్తిగా కాలిపోకుండా శకలాలుగా మిగిలిపోతుందని నివేదికలు చెబుతున్నాయి.
కృత్రిమ లోహ పరికరాలు: ఆధునిక కాలంలో చాలా మంది శరీరాల్లో వైద్య అవసరాల కోసం పేస్‌మేకర్లు, తుంటి మార్పిడి ఇంప్లాంట్లు, రాడ్లు, లేదా స్క్రూలు వంటి కృత్రిమ పరికరాలు అమర్చుతున్నారు. ఇవి అత్యంత కఠినమైన లోహాలతో తయారవుతాయి కాబట్టి అధిక ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుంటాయి. దహనం తర్వాత బూడిద నుండి వీటిని ప్రత్యేకంగా గుర్తించి తొలగిస్తారు.
సాధారణంగా సమాజంలో ఒక ప్రచారం ఉంది.. శరీరం మొత్తం కాలినా బొడ్డు భాగం మాత్రం కాలిపోకుండా అలాగే ఉండిపోతుందని చాలా మంది నమ్ముతారు. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వైద్యులు కొట్టిపారేస్తున్నారు. బొడ్డు అనేది విడిగా ఉండే ఒక ప్రత్యేక అవయవం కాదు. అది కేవలం చర్మం, కండరాలు, ఇతర మృదువైన కణజాలాలతో ఏర్పడిన ఒక భాగం మాత్రమే. కాబట్టి చితిపై మిగతా చర్మం, మాంసం ఎలా కాలిపోతాయో.. బొడ్డు కూడా అదే విధంగా పూర్తిగా కాలిపోతుంది. అది కాలిపోదనేది కేవలం ఒక అపోహ, మూఢనమ్మకం మాత్రమే.
శాస్త్రీయంగా చూసుకుంటే.. ఎముకలు, పంటి ఎనామెల్, లోహపు వైద్య పరికరాలు మినహా శరీరంలోని మిగతా భాగాలన్నీ బూడిదగా మారుతాయి. అందుకే అంత్యక్రియల తర్వాత అస్థికలను సేకరించి పవిత్ర నదులలో కలపడం మన సంస్కృతిలో భాగంగా మారింది.