
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనకు పడిన స్కాలర్ షిప్ డబ్బులు రూ.900 విత్ డ్రా చేసుకోవడానికి వెళ్ళిన ఒక పాఠశాల విద్యార్థినికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె అకౌంట్లో రూ.900 వందలకు బదులుగా ఏకంగా రూ.759 కోట్లు కనిపించాయి. అది చూసిన విద్యార్థిని ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా బిత్తరపోయారు. ఈ విషయం క్షణాల్లోనే జనాలు దృష్టికి చేరడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.ఇది బ్యాంకింగ్ పొరపాటా లేక మరేదైనా కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సౌత్ బారా హల్దీబారి గ్రామానికి చెందిన సుపర్ణ రాయ్ అనే విద్యార్థిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. ఆమె చాలా పేద కుటుంబానికి చెందిన విద్యార్థిని.. ఆమె తండ్రి కూడా పొట్టకూటి కోసం కేరళలో వలస కూలీగా పనిచేస్తున్నారు. అయితే సువర్ణ తల్లి ఫోన్‌కు స్కాలర్‌షిప్ కింద రూ.900 జమ అయినట్లు మెసేజ్ వచ్చింది. అయితే తన పాత షూ పాడవడంతో స్కాలర్ షిప్ డబ్బులతో కొత్త బూట్లు కొనుక్కోవాలని సువర్ణ అనుకుంది. దీంతో ఆమె తన అన్నతో కలిసి ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లింది. తన ఖాతాలో ఉన్న రూ. 900 విత్ డ్రా చేసి ఇవ్వమని షాప్ యజమానికి కోరింది.
అయితే రూ.900 విత్‌డ్రా చేసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ చెక్ చేయగా ఆమె ఖాతాలో ఇంకా 759 కోట్ల, 69 లక్షల, 51 వేల, 951 రూపాయలు కనిపించాయి. ఆ నెంబర్ చూసి.. షాప్ యజమానితో సహా సువర్ణ, ఆమె అన్నయ్య సైతం షాక్‌కు గురయ్యారు. అయితే తొలుత ఇదేదో సర్వర్ ఇష్యూ అనుకొని మళ్లీ మళ్లీ చెక్ చేశారు. కానీ నిజంగానే ఆమె అకౌంట్లో ఆ డబ్బులు ఉన్నాయి. దీంతో ఈ విషయాన్ని వెంటనే బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ డబ్బులతో తమకు ఎలాంటి సంబంధం లేదని సువర్ణం కుటుంబం చెప్పేసింది.
ఈ సంఘటనలు స్థానికంగా పెద్ద చర్చకు దారితీయడంతో పోలీసుల దృష్టికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇది సాంకేతిక లోపమా లేక బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగిన పొరపాటా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. గతంలో అలీపుర్దువార్ జిల్లాలోని ఫలకాటాలో కూడా ఒక పేద కుటుంబం ఖాతాలో ఇలాగే కోట్ల రూపాయలు జమ అయినట్లు సమాచారం. ఈ వింత లావాదేవీల వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో తేల్చే పనిలో పడ్డారు అధికారులు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి