
ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రులను ఒప్పించడం కోసం యువతీ యువకులు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక యువతి తన ప్రేమ వివాహానికి ఇంట్లో వారిని ఒప్పించడానికి అత్యంత వింతైన, ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుంది. బ్లాక్‌బస్టర్ హిందీ సినిమా షోలేలో వీరూ (ధర్మేంద్ర) పాత్ర గుర్తుందిగా? బసంతిని పెళ్లి చేసుకోవడం కోసం ఊరిలోని వాటర్ ట్యాంక్ ఎక్కి రచ్చ చేస్తాడు. సరిగ్గా అదే సీన్‌ను ఈ కాలపు యువతి రియల్ లైఫ్‌లో రీ-క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. అందులో ఒక యువతి తన ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదనే కోపంతో ఏకంగా ఒక ఎత్తైన వాటర్ ట్యాంక్ పైకి ఎక్కేసింది. ఇంతకీ వైరల్ వీడియోలో ఏముందంటే..
ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక యువతి ఎత్తైన వాటర్ ట్యాంక్ పైభాగంలో నిలబడి ఉండటం కనిపిస్తుంది. చుట్టుపక్కల వారు ఆమెను కిందకు దిగమని ఎంత కోరినా ఆమె వినలేదు. తన ప్రేమను అంగీకరిస్తేనే కిందకు దిగుతానని భీష్మించుకు కూర్చుంది. ఈ హై-డ్రామాను కింద ఉన్న స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని కేవలం కామెడీగా చూస్తూ, కలికాలం.. లవ్ మ్యారేజ్ కోసం ఈ రేంజ్ ఐడియాలు వేస్తున్నారా! అని కామెంట్లు పెడుతుండగా, మరికొందరు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం నవ్వుకునే విషయం కాదు, చాలా ప్రమాదకరమైన చర్య. ఇటువంటి పిచ్చి పనుల వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు అని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. సినిమా ప్రభావం యువతపై ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..