ఇటీవల కాలంలో పాములు నివాసాలలోకి రావడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా వేసవి వేడిని తాళలేక ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ కోవలోనే అమెరికాలో నివాసముంటున్న ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. ముందుగానే అతడు ప్రమాదాన్ని పసిగట్టడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..
వివరాల్లోకి వెళ్తే.. న్యూజెర్సీలో నివాసముంటున్న ఓ వ్యక్తికి ఫ్రిడ్జ్ నుంచి వాటర్ బాటిల్ తీసుకుంటుండగా.. వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయోనని భయపడుతూనే చూడగా.. ఫ్రిడ్జ్ వెనుక పైడ్ బాల్ జాతికి చెందిన పైథాన్ బయటపడింది. ఈ పాము అరుదైన జాతికి చెందినది కావడంతో.. అతడు వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాడు. మరోవైపు ఈ బాల్ పైథాన్‌లను చాలామంది పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారట. ఈ కొండచిలువ విషరహితమైనది మాత్రమే కాదు.. ఎవరైనా దీనిపై దాడికి యత్నిస్తే.. ముడుచుకునే తత్త్వం కూడా దీని సొంతం. కాగా, స్నేక్ క్యాచర్లు ఈ పాముకు సంబంధించిన ఓనర్లు తమను సంప్రదించాలని ఫేస్‌బుక్ ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశారు.