
పెళ్లంటే ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఎంతో ముఖ్యమైన ఘట్టం. పెళ్లితో ఇద్దరు వ్యక్తుల జీవితం టర్న్ అవుతుంది. అప్పటి వరకూ వేర్వేరుగా జీవించిన వారు పెళ్లితో ఒక్కటిగా జీవిస్తారు. అందుకే ఈ వేడుకను బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటారు. ఇందుకు పేద, ధనిక తేడా ఉండదు. లక్షల్లో ఖర్చు చేసి ఘనంగా చేసుకుంటారు. ప్రస్తుత కాలంలో కొందరు స్తోమతకు మించి అప్పులు చేసి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది ఇద్దరు ఐఏఎస్‌లు తమ వివాహాన్ని ఎంతో నిరాడంబరంగా జరుపుకుని అందరికీ స్పూర్తిగా నిలవడమే కాకుండా ఆర్భాటాలకు పోయి అప్పుల పాలవుతున్నవారికి సందేశాన్నిచ్చారు. కేవలం రూ.2 వేలతో పెళ్లి చేసుకున్న ఇద్దరు ఐఏఎస్ ల పెళ్లి వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. వీరిద్దరూ వివాహం చేసుకొని రెండేళ్లయింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు వారి పెళ్లి వీడియో వైరల్ అవుతోంది.
తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ మౌనిక.. ఛత్తీస్ గఢ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి యువరాజ్ మర్మత్ లు 2022 బ్యాచ్ కు చెందిన వారు. మౌనిక ఫార్మకాలజీ పూర్తి చేశాక సివిల్స్ చేశారు. ఇక రాజస్థాన్ కు చెందిన యువరాజ్ సివిల్ ఇంజనీరింగ్ చేసి.. కొన్నాళ్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో జాబ్ చేసిన తర్వాత సివిల్స్ ను ఎంచుకున్నారు. 2022లో ముస్సోరిలో ట్రైనింగ్‌లో ఉన్న వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడటం..అది ప్రేమగా మారి పెళ్లి పీటలవరకూ వెళ్లింది. 2023లో ఎలాంటి హంగు.. ఆర్భాటం లేకుండా కుటుంటు సభ్యులు, స్నేహితులు ఇతర ముఖ్యుల మధ్య కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం కేవలం రెండు వేల రూపాయల ఖర్చుతో సింపుల్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేసి పూలదండలు మార్చుకొని మిఠాయిలు పంచిపెట్టారు.
ప్రస్తుతం ఈ ఆదర్శ జంట రెండో వివాహ వార్షికోత్సం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ పెళ్లి జరిగిన తీరును గుర్తు చేసుకుంటూ తమ పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పెళ్లి అంటే ఓ కమిట్ మెంట్.. కలకాలం తోడు నీడగా ఉంటామని ఒకరికొకరు ఇచ్చుకునే మాట అని, దీనికి అనవసర ఖర్చులు అవసరం లేదని వీరి పెళ్లి వీడియో ప్రూవ్ చేస్తుంది. ఈ పెళ్లి వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.