
బీహార్‌లోని బక్సర్‌లో వెలుగులోకి వచ్చిన ఓ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కఫన్ వస్త్రంలో చుట్టిన మృతదేహాన్ని నేలపై ఈడ్చుకుంటూ పోస్ట్‌మార్టం గదిలోకి తీసుకెళ్తున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆసుపత్రి, పోస్ట్‌మార్టం కేంద్రం, కనీస మౌలిక ఏర్పాట్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
2026 ఆగస్టు 31న బక్సర్‌లోని రైల్వే ఫుట్‌బ్రిడ్జ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న జీఆర్‌పీ సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని కేంద్రానికి తరలించారు.
అయితే పోస్ట్‌మార్టం కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత మృతదేహాన్ని తరలించిన విధానమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. స్ట్రెచర్ కానీ ప్రత్యేక శవవాహన పరికరాలను ఉపయోగించకుండా, కఫన్‌లో చుట్టిన మృతదేహాన్ని నేలపై ఈడ్చుకుంటూ లోపలికి తీసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలను ఎవరో మొబైల్ ఫోన్‌లో రికార్డు చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన వ్యక్తి గుర్తుతెలియని వ్యక్తి అయినప్పటికీ, మృతదేహాన్ని గౌరవప్రదంగా నిర్వహించడం వ్యవస్థ బాధ్యత కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మృతదేహాలను తరలించేందుకు పోస్ట్‌మార్టం కేంద్రంలో స్ట్రెచర్లు లేదా ఇతర సౌకర్యాలు ఉన్నాయా? ఉంటే వాటిని ఎందుకు ఉపయోగించలేదు? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
మరోవైపు, ఈ వీడియో ఆధారంగా మాత్రమే పూర్తి నిర్ధారణకు రావడం సరికాదని, ఘటన వెనుక వాస్తవ పరిస్థితులు ఏమిటో అధికారుల దర్యాప్తుతో తేలాల్సి ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మృతదేహాన్ని ఈ విధంగా తరలించడానికి కారణమేంటి, అక్కడ సిబ్బంది కొరత లేదా పరికరాల సమస్య ఉందా, బాధ్యులెవరనే అంశాలపై విచారణ జరుగుతోంది.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..