లక్నో, అక్టోబర్ 29: రైలులో ఏసీ పని చేయడం లేదని రైలులోని పోలీసులకు ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. కానీ ఎవరు పట్టించుకోలేదు. దీంతో చిర్రెత్తిపోయిన సదరు ప్రయాణికుడు ట్రైన్ ఎమర్జెన్సీ చైన్ లాగాడు. ట్రైన్ ఆగింది. దీంతో కోపోధ్రిక్తులైన రైల్వే సిబ్బంది సదరు ప్రయాణికుడిని విచక్షణారహితంగా కొట్టి, రైలు నుంచి ఈడ్చుకెళ్లారు.. ఈ షాకింగ్ ఘటన పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్‌లోని AC కంపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
పాట్నా-కోటా ఎక్స్‌ప్రెస్ 13237లోని ఏసీ కోచ్ బీ-6లో ప్రయాణిస్తున్న అనంత్ పాండే అనే ప్రయాణికుడు ఏసీ సరిగా పనిచేయడం లేదని సిబ్బందికి ఫిర్యాదు చేసిన ఘటన లక్నోలో చోటుచేసుకుంది. అయితే సిబ్బంది మాత్రం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అనంత్ రైలు అయోధ్య నుంచి బయలుదేరే సమయంలో చైన్ లాగాడు. ఆ తర్వాత కూడా విచారణకు రాకపోవడంతో మరో రెండు సార్లు ఇలాగు చైన్ లాగాడు. అప్పుడు రైలు రాత్రి 11:30 గంటలకు చార్‌బాగ్ స్టేషన్‌కు చేరుకుంది. అనంతరం రైలు టిక్కెట్ చెకింగ్ స్టాఫ్ (TTE)తో పాటు సుమారు 10 మంది RPF అధికారులు పాండేపై దాడి చేసి అతనిని కోచ్ నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన అక్టోబర్ 28న చోటు చేసుకుంది.
A passanger onboard Patna-Kota Express pulled the chain after “AC not cooling” complaint went unheard. His complaint was finally acknowledged but not the way he was expecting. pic.twitter.com/o1SOaxRntV
— Piyush Rai (@Benarasiyaa) October 28, 2024
దీనిపై లక్నో డివిజన్ ఆర్పీఎఫ్ కమాండెంట్ దేవాన్ష్ శుక్లా మాట్లాడుతూ.. పాట్నా కోటా ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న అనంత్ పాండే అనే ప్రయాణికుడు చైన్‌ను మూడుసార్లు లాగి రైలు ఆపేశాడు. ఇది ఆర్పీఎఫ్ చట్టం కింద నేరం కిందకు వస్తుంది. ఈ విషయాన్ని ప్రయాణికుడికి కూడా వివరించి, చార్‌బాగ్ వద్ద చైన్ లాగినందుకు సెక్షన్ 141 కింద కేసు నమోదు చేశాం. పాండేను RPF కార్యాలయానికి తీసుకెళ్లి, అక్కడి నుంచి రైల్వే కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ప్రయాణికుడిని లాగారేగానీ.. RPF సిబ్బంది అతనిపై దాడి చేయలేదని శుక్లా తెలిపాడు. మరోవైపు ప్రయాణికుడిని కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ప్రయాణికుల హక్కులు, ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడంలో రైల్వే అధికారుల బాధ్యతపై చర్చలకు దారితీసింది. ప్రయాణికుడు కొడుతున్న వీడియో చూసిన నెటిజన్లు రైల్వే అధికారుల తీరుపై మండిపడుతున్నారు. చట్టం ముసుగులో గూండాయిజాన్ని ప్రదర్శిస్తున్నారని, రైలు చైన్ లాగడం తప్పు కాదని నెటిజన్లు రైల్వే అధికారుల తీరును తప్పుబడుతున్నారు.