Priyanka Mishra: ఆమె బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగి. పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. అయితే సోషల్ మీడియాలో పాపులర్ కావడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇంకేముంది ఉద్యోగం ఉష్ పటాక్ అయిపోయింది. అదేంటి ఒక్క పోస్ట్ తోనే ఉద్యోగం నుంచి తీసేస్తారా.. అంటే అది మామూలుగా చేస్తే పర్వాలేదు కానీ పోలీస్ యూనిఫాంలో ఉండి రివాల్వర్ చేతిలో పట్టుకొని సినిమాలో మాదిరిగా డైలాగ్స్ చెబుతూ వీడియో చేసింది. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆమె తీరును తూర్పారబట్టారు. ఓ పోలీసు అయి ఉండీ ఇలా చేస్తారా అంటూ తలంటేశారు! సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా నెగెటివ్ కామెంట్స్ వచ్చిపడ్డాయి! మరోవైపు..శాఖాపరమైన చర్యలు కూడా మొదలయ్యాయి. పైఅధికారులు ఆమెను విధులకు దూరంగా ఉంచారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర డిప్రెషన్‌లో కూరుకుపోయిన ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా అధికారులు ప్రియాంకామిశ్రా రాజీనామాను ఆమోదించారు. విధుల నుంచి తొలగించారు.
వాస్తవానికి ప్రియాంక మిశ్రా కాన్పూర్ నివాసి. 2020లో పోలీస్ కానిస్టేబుల్ పోస్టులో చేరారు. శిక్షణ పొందిన తరువాత మూడు నెలల క్రితం ఆగ్రాలోని MM గేట్ పోలీస్ స్టేషన్‌లో విధులలో చేరారు. రివాల్వార్‌తో చేసిన వీడియో వైరల్ కావడంతో ఆమెకు విపరీతంగా ఫాలోవర్లు పెరిగిపోయినప్పటికీ వృత్తి జీవితంలో మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇలా వీడియోలు చేయకూడదన్న విషయం తనకు తెలియదని ప్రియాంక తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తప్పు తెలిసిన వెంటనే వీడియోలను డిలీట్ చేశానన్నారు. కానీ ప్రియాంకను చాలామంది ‘రివాల్వర్ రాణి’ అంటూ ట్రోల్ చేశారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా ఆమె బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పింది.