Ram Mohan Naidu: మరో టాలెంట్‌ను బయటపెట్టిన కేంద్రమంత్రి.. తమ్ముడి సంగీత్ వేడుకలో డాన్సుతో ఇరగదీసిన..
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు డ్యాన్స్‌తో ఇరగదీశాడు. బాబాయ్ కొడుకు సంగీత్ వేడుకల్లో తన తమ్ముళ్లతో కలిసి అదరగొట్టే స్టెప్పులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రిలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ అందరూ అశ్చర్యపోతున్నారు.
రామ్మోహన్ నాయుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారు ఉండరు. స్పష్టమైన తన వాగ్ధాటితో అనర్గళంగా ఉపన్యాసం ఇవ్వడం ఆయనలో ఉన్న ఓ ప్రత్యేకత. 2024 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించిన రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఎప్పుడు రాజకీయాలతో బిజిబిజీగా ఉండే ఈ కేంద్ర మంత్రి తనలోని ఓ కొత్త టాలెంట్‌ను బయట పెట్టారు. తనలో ఉన్న డాన్సర్‌ను బయటకు తీశాడు.
తన బాబాయ్ కింజరాపు ప్రభాకరరావు కుమారుడు వివాహ వేడుకకు సంబంధించి జరిగిన సంగీత్ ఫంక్షన్‌లో స్టెప్పులేసి ఇరగదీశాడు రామ్మోహన్ నాయుడు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ మూవీలోని ఓ పాటకు మంత్రి అచ్చెన్నాయుడు కుమారులతో కలిసి స్టేజ్‌పై డాన్స్ చేశాడు. ఈనెల 31న బాబాయ్ ప్రభాకరరావు కొడుకు వివాహం జరగనుంది. అందులో భాగంగా ముందస్తు పెళ్లి వేడుకలు జోరుగా జరుగుతున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొంత వీలు కల్పించుకొని తన సోదరుడు పెళ్లి వేడుకలలో బిజీ అయ్యారు. సోమవారం విజయనగరం జిల్లాలోని సన్ రే రిసార్ట్‌లో జరిగిన ప్రభాకర రావు కుమారుడి సంగీత్ ఫంక్షన్‌లో పాల్గొని డాన్సులతో సందడి చేశారు. ఫంక్షన్‌లో సాంప్రదాయ కుర్తా పైజామా ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. స్టేజ్ పై రామ్మోహన్ నాయుడు వేసిన స్టెప్పులు చూసి ఇతనిలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ చూసిన వారంతా ఫిదా అయ్యారు. బాబాయ్ అచ్చెన్నాయుడు సైతం రామ్మోహన్ నాయుడు డాన్స్ చూసి లోలోన మురిసిపోయారు. స్టేజ్‌పై రామ్మోహన్ నాయుడు డాన్స్ వేస్తున్నంత సేపు ఈలలు, క్లాప్‌లు కొడుతూ అంతా తెగ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రి వేసిన డాన్స్ వీడియోలు నట్టింట తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..