
ఏదైనా హోటల్‌కు వెళ్లి.. ఒక ప్లేట్ ఇడ్లీని ఆర్డర్ చేస్తాం, లేదా ఇంట్లో కూడా చేసుకొని తింటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? అసలు దీనికి ఇడ్లీ అనే పేరు ఎలా వచ్చిందో? భారతీయుల అల్పాహారంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకాల్లో ఇడ్లీ ఒకటి. దక్షిణ భారతదేశంలో పుట్టిన ఈ ఆహారం నేడు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లోనూ ఆదరణ పొందుతోంది. అయితే ప్రతిరోజూ ఇడ్లీ తినే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. అసలు ఇడ్లీకి ‘ఇడ్లీ’ అనే పేరు ఎలా వచ్చింది? దాని వెనుక చరిత్ర ఏమిటి? అనే ఆసక్తికర విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ఇడ్లీ అనే పదానికి సంబంధించిన తొలి ప్రస్తావన క్రీ.శ.10వ శతాబ్దానికి చెందిన కన్నడ సాహిత్యంలో కనిపిస్తుంది. పండితుడు శివకోట్యాచార్య రచించిన వడ్డారాధనే అనే గ్రంథంలో ఇడ్డలిగె (Iddalige) అనే పదం ప్రస్తావనకు వచ్చింది. ఆ కాలంలో తయారుచేసిన ఇడ్డలిగె, నేటి ఇడ్లీతో పోలిస్తే కొంత భిన్నంగా ఉండేదని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఇదే పదం క్రమంగా మార్పులు చెంది నేటి ఇడ్లీగా రూపాంతరం చెందిందని భాషా నిపుణులు చెబుతున్నారు.
మరో అభిప్రాయం ప్రకారం, ఇడ్డలిగె అనే పదం నుంచి తమిళంలో ఇడలి, ఆ తర్వాత తెలుగు, మలయాళం వంటి ఇతర దక్షిణ భారత భాషల్లో ఇడ్లీగా మారింది. కాలక్రమేణా ఉచ్చారణలో వచ్చిన చిన్నచిన్న మార్పులతో ఈ పేరు స్థిరపడిందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇడ్లీ పుట్టుకపై మరో ఆసక్తికరమైన సిద్ధాంతం కూడా ఉంది. కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఇండోనేషియాలో తయారుచేసే ఆవిరి వంటకాల ప్రభావంతో దక్షిణ భారతదేశంలో ఇడ్లీ రూపుదిద్దుకుని ఉండొచ్చని భావిస్తారు. అయితే దీనిపై స్పష్టమైన ఆధారాలు లేవు. మరికొందరు మాత్రం ఇడ్లీ పూర్తిగా దక్షిణ భారతీయుల సృష్టేనని వాదిస్తారు.
నేటి ఇడ్లీ తయారీ విధానం కూడా శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. బియ్యం, మినప్పప్పును నానబెట్టి, పులియబెట్టి, ఆవిరిలో ఉడికించడం ద్వారా తయారయ్యే ఈ ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. తక్కువ నూనె, అధిక పోషక విలువల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన అల్పాహారంగా గుర్తింపు పొందింది. అలా చూస్తే, ప్రతిరోజూ మన ప్లేట్‌లో కనిపించే ఇడ్లీ వెనుక కూడా వెయ్యేళ్లకు పైగా చరిత్ర, భాషా పరిణామం, సంస్కృతి మిళితమై ఉన్నాయి. సాధారణంగా కనిపించే ఈ వంటకం పేరు వెనుక ఉన్న కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉండటం విశేషం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి