Trending: అతను రోడ్డు పక్కన తోపుడు బండిపై దుస్తులు అమ్ముకునే పేద వ్యక్తి. కానీ ఇద్దరు పోలీసులు గన్నులతో నిరంతరం అతనికి సెక్యూరిటీగా ఉంటున్నారు. అంత సాదాసీదా మనిషికి సెక్యూరిటీ ఎందుకని ఎవ్వరికీ అర్థం కావడం లేదు. సాయుధ పోలీసులు ఆ వీధి వ్యాపారికి రక్షణగా ఉన్న ఫోటోలు ప్రజంట్ నెట్టింట వైరల్‌గా మారాయి. దీని వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం పదండి. ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లోని ఎటా(Etah) జిల్లాకు చెందిన రామేశ్వర్ దయాల్ తోపుడు బండిపై దుస్తులు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ(Samajwadi Party) సీనియర్ నేత రామేశ్వర్ సింగ్ సోదరుడు జుగేంద్ర సింగ్‌ను కలిశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. కులం పేరుతో జుగేంద్ర తనను దూషించారని రామేశ్వర్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనిపై జుగేంద్ర హైకోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే రామేశ్వర్ దయాల్‌ను కోర్టులో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టుకు వచ్చిన దయాల్‌ను చూసిన జడ్జి ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. ఇద్దరు బాడీగార్డులను భద్రతగా నియమించాలని ఆదేశించారు. దీంతో స్థానిక పోలీసులు అతనికి రక్షణ కల్పిస్తున్నారు.