
బుధవారం సాయంత్రం చెలావాస్ గ్రామంలో ఉమ్రావ్ సింగ్ సేథ్‌కు చెందిన పాత భవనం కూల్చివేసిన తర్వాత శిథిలాలలో వెండి నాణేలు కనిపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ధాన్యం మార్కెట్ సమీపంలో ఒక బుల్డోజర్ శిథిలాలను చదును చేస్తుండగా, కొంతమంది వెండి నాణేలను గుర్తించారు. ఈ వార్త వెంటనే గ్రామమంతా వ్యాపించింది. గ్రామస్తుల వివరాల ప్రకారం… శిథిలాలలో 100 కి పైగా వెండి నాణేలు దొరికినట్లు సమాచారం.
ఉమ్రావ్ సింగ్ సేథ్ పాత భవనాన్ని అతని మనవడు రాజ్ కుమార్.. మాన్ సింగ్ అనే వ్యక్తికి విక్రయించాడని గ్రామస్తులు తెలిపారు. మాన్ సింగ్ ఆ భవనాన్ని కూల్చివేసి, ధాన్యం మార్కెట్ సమీపంలో ట్రాక్టర్-ట్రాలీలలో శిథిలాలను పడేశాడు. శిథిలాలను తొలగిస్తున్నప్పుడు వెండి నాణేలు దొరికినట్లు సమాచారం అందడంతో స్థానికులు సంఘటనా స్థలంలో గుమిగూడి నాణేల కోసం వెతకడం ప్రారంభించారు.
వెండి నాణేలు దొరికాయనే వార్త వ్యాపించగానే, సమీప ప్రాంతాల నుండి ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలలో నాణేల కోసం ఎగబడ్డారు. చాలా మంది నాణేలను తీసుకొని ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం నాటికి, శిథిలాలను పూర్తిగా జల్లెడ పట్టారు. సంఘటన గురించి సమాచారం ఇచ్చినప్పటికీ, పోలీసులు లేదా ఏ పరిపాలన అధికారి సాయంత్రం వరకు సంఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం
కాగా చీకటి పడే వరకు స్థానికులు నాణేల కోసం వెతుకుతూనే ఉన్నారు. వెండి నాణేలు దొరికిన వారు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ వెండి నాణేల కోసం శిథిలాల కోసం వెతుకుతూ కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..