Wedding Video: పెళ్లి వేడుకలో అపశృతి చోటుచేసుకుంది. పెళ్లి ఊరేగింపులో వరుడి గుర్రపు బండి మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటన అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. గుర్రపు బండికి మంటలు అంటుకోగానే.. స్థానికులు అప్రమత్తమై అదుపు చేశారు. దీంతో వరుడితో పాటు పలువురు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా వరుడు.. గుర్రపు బగ్గీలో బయలుదేరాడు. బంధువుల, స్నేహితుల నృత్యాలతో హోరెత్తిస్తున్నారు. వరుడితో పాటు మరికొంత మంది చిన్నారులు బగ్గిలో కూర్చొని ఉన్నారు. ఈ క్రమంలో శోభాయాత్రలో అలజడి రేగింది. పెళ్లి మండపానికి వెళ్తున్న గుర్రపు బగ్గీకి నిప్పురవ్వలు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. పటాకులు కాలుస్తున్న క్రమంలో గుర్రపుబగ్గిపై నిప్పురవ్వలు పడటంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై వరుడితో పాటు చిన్నారులను కాపాడారు.
అలాగే బండి నుంచి గుర్రాలను సైతం విడదీశారు. అనంతరం నీటిని చల్లి మంటలను ఆర్పి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయిందని పోలీసులు, స్థానికులు తెలిపారు. అయితే గుర్రపు బగ్గీలో పటాకులు ఉన్నాయని.. వాటిపై నిప్పు రవ్వలు పడటంతో మంటలు అంటుకున్నట్లు పేర్కొంటున్నారు.
కాగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వేడుకల్లో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలని.. టపాసులను కాల్చేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. అయితే.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read: