
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్ జిల్లా కవినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రాజ్ నగర్ సెక్టార్-14లో జూలై 1న జరిగిన ఒక అగ్నిప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో భారీగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాటిని అదుపులోకి తెచ్చారు. మొదట దీన్ని ఒక సాధారణ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంగా అందరూ భావించారు. కానీ, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక షాకింగ్ వీడియో ఈ కథను పూర్తిగా మార్చేసింది.
సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్‌లో, ఆ ఇంటి యజమాని, కోటీశ్వరుడైన వ్యాపారవేత్త ముఖేష్ గుప్తా స్వయంగా తన ఇంట్లోని సోఫాపై న్యూస్ పేపర్ ముక్కలను అమర్చి, నిప్పు అంటించడం స్పష్టంగా కనిపించింది. ఆ పేపర్లు కాలిన వెంటనే సోఫాకు మంటలు అంటుకుని, క్షణాల్లో ఇల్లంతా దట్టమైన పొగ, మంటలు వ్యాపించాయి. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, ముఖేష్ గుప్తా కుటుంబంలో గత కొన్ని రోజులుగా తీవ్రమైన మనస్పర్థలు, గొడవలు నడుస్తున్నాయి. ఇంట్లో వివాదాల నేపథ్యంలోనే తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆయన, ఇంట్లోని వారిని భయపెట్టడానికో లేదా హాని తలపెట్టడానికో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
#Ghaziabad #india Fire: Businessman Sets Own House Ablaze Amid Family Dispute
In a shocking incident in Rajnagar, Ghaziabad on July 1, crorepati businessman Mukesh Gupta allegedly assaulted his wife Sangeeta and two children before deliberately setting fire to his house sofa… pic.twitter.com/F50uKQiWrg
— Thepagetoday (@thepagetody) July 4, 2026
ఈ ఘటనపై కవినగర్ ఏసీపీ సూర్యబలి మౌర్య మాట్లాడుతూ, ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోను తాము పరిశీలిస్తున్నామని తెలిపారు. వీడియో విశ్వసనీయతను, ప్రామాణికతను నిర్ధారించడానికి ఫోరెన్సిక్ సహాయం తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందనప్పటికీ, ప్రజా భద్రతకు భంగం కలిగించడం, ప్రాణాలకు ముప్పు తెచ్చేలా వ్యవహరించినందుకు గానూ సుమోటోగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఒకవేళ వీడియో నిజమని తేలితే వ్యాపారవేత్తపై కఠిన సెక్షన్ల కింద చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.