Viral: రోడ్డుపై వెళ్తుండగా రాతి క్వారీలో కనిపించింది చూసి ఆశ్చర్యపోయిన వ్యక్తి.. ఆ తర్వాత

ఇది నిజంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన. ఓ ముస్లిం వ్యక్తి శివలింగం లాంటి ఆకారాన్ని కనుగొన్నాడు. ఆపై కాశ్మీరి పండిట్లు అక్కడికి చేరుకుని ప్రత్యేకమైన పూజలు చేశారు. ఈ ఘటన కేవలం ఒక ఆధ్యాత్మిక కనుగొనికగా కాకుండా, మతసౌహార్దానికి ప్రతీకగా భావిస్తున్నారు.

Viral: రోడ్డుపై వెళ్తుండగా రాతి క్వారీలో కనిపించింది చూసి ఆశ్చర్యపోయిన వ్యక్తి.. ఆ తర్వాత
Shivling

Updated on: Sep 07, 2025 | 3:01 PM

మధ్య కాశ్మీర్‌లోని గందెర్‌బాల్‌ జిల్లాలో మానస్బల్‌ సమీపంలోని చెకి యాంగూరా గ్రామంలో శనివారం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగుచూసింది. అక్కడి రాతి క్వారీలోలో శివలింగం ఆకారంలో కనిపించే ఒక శిల్పాన్ని గుర్తించడంతో.. స్థానిక భక్తులంతా.. పారవశ్యంలో మునిగిపోయారు. అయితే ఓ ముస్లిం వ్యక్తి.. ఆ ఆకారాన్ని గుర్తించడం మరింత విశేషమని చెప్పాలి.

స్థానిక నివాసి అయాజ్‌ అహ్మద్‌ ఎల్లాహీ క్వారీ పక్కగా వెళ్తుండగా శివలింగం లాంటి ఆకారం అతనికి కనిపించింది. తనకు ఆ ప్రదేశం వ్యక్తిగతంగా ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆయన చెప్పాడు. తన తండ్రి కూడా ఈ ప్రాంతాలోనే ఎక్కువగా తిరిగేవారని వెల్లడించాడు. నేను ఆ శిల్పాన్ని చూసిన వెంటనే సమీపంలోని సైనిక్‌ స్కూల్‌ మానస్బల్‌ వద్ద ఉన్న SSB పోస్టుకు సమాచారం ఇచ్చాను అని అయాజ్‌ ఎల్లాహీ వివరించాడు.

SSB సిబ్బంది వెంటనే జిల్లా అధికారులకు సమాచారం అందించగా.. విషయం కాశ్మీరీ పండిట్‌ సమాజానికి కూడా చేరింది. కొన్ని గంటల్లోనే కాశ్మీరీ పండిట్‌ సమాజ సభ్యులు ఆ ప్రదేశానికి చేరుకుని, అక్కడే పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.

స్థానిక ముస్లింలు కూడా ఈ పూజల్లో పాల్గొన్న పండిట్‌ సమాజాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. పరస్పర గౌరవం, సానుభూతిని వ్యక్తం చేశారు. ఇది కేవలం రాయి కాదు.. ఆ శివయ్య స్వరూపం. ఆయన జాడ ఇక్కడ కనిపించడం మమ్మల్ని తన్మయత్వానికి గురి చేస్తుందని కాశ్మీరీ పండిట్‌ విర్‌ జీ రైనా చెప్పారు. కొద్ది గంటల్లోనే ఆ స్థలం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. భక్తులు ధూపాలు, పూలు సమర్పిస్తూ భక్తి భావంతో ప్రార్థనలు చేశారు. పండిట్‌ సమాజం అధికారులు ఆ శివలింగం వంటి శిల్పాన్ని సంరక్షించేందుకు, భవిష్యత్తులో పూజలు కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

స్థానికులు ఈ సంఘటనను మతసామరస్యానికి ప్రతీకగా భావిస్తున్నారు. “ఇది మా ప్రాంతంలో ఆధ్యాత్మిక ఐక్యతకు చిహ్నం. ఈ క్షణం మాకు దైవానుగ్రహంగా ఉందనిపిస్తోంది” అని ఒక స్థానిక భక్తుడు ఆనందంతో చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..