
సాధారణంగా నగల షాపుల్లో దొంగతనాలు జరగడం, కిలాడీ దొంగలు ప్లాన్ వేసి ఆభరణాలు ఎత్తుకెళ్లడం మనం వింటూనే ఉంటాం. కానీ, ఏకంగా 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు మాయమైతే, ఆ దొంగ ఎవరో తెలిసాక పోలీసులు, షాపు యజమాని నోరెళ్లబెట్టిన సంఘటన కర్ణాటకలోని తుమకూరులో వెలుగుచూసింది. అసలేం జరిగిందో పోలీసులు, షాప్ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు పూర్తి వివరాల్లోకి వెళ్దాం..
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ జువెలరీ షాపులో రూ.10 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు మాయమవ్వడం కలకలం రేపింది. తుమకూరు నగరంలో ఉన్న ఒక ప్రముఖ జువెలరీ షాపు యజమాని ప్రతిరోజూ లాగే రాత్రి షాపు మూసివేసి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి డిస్‌ప్లేలో ఉంచిన కొన్ని విలువైన బంగారు ఆభరణాలు, రూ. 10 లక్షల విలువైన వజ్రాల నెక్లెస్ కనిపించకుండా పోయాయి. షాపు తాళాలు వేసే ఉన్నాయి. తలుపులు గానీ, కిటికీలు గానీ పగులగొట్టలేదు. దీంతో షాపులో పనిచేసే సిబ్బందిపై అనుమానంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు షాపులోని ఉద్యోగులను తీవ్రంగా విచారించారు. అయితే, వారి ప్రవర్తనలో ఎలాంటి అనుమానం రాకపోవడంతో, షాపులో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలించడం ప్రారంభించారు. రాత్రి సమయంలో రికార్డయిన ఫుటేజ్ చూస్తున్న పోలీసులకు ఒక విచిత్రమైన దృశ్యం కనిపిచింది. రాత్రి వేళ షాపులో లైట్లు ఆర్పివేసిన తర్వాత, ఒక పెద్ద ఎలుక సీలింగ్ పైనుంచి డిస్‌ప్లే స్టాండ్ వైపు వచ్చింది. ఆభరణాలు ఉంచిన కేస్ దాకా వెళ్లిన ఆ ఎలుక, మెరుస్తున్న వజ్రాల నెక్లెస్‌ను జాగ్రత్తగా నోటకరుచుకుని మళ్లీ సీలింగ్ రంధ్రంలోకి శరవేగంగా వెళ్లిపోయింది.
ఎలుక చేసిన ఈ ఘరానా దొంగతనం సీసీటీవీలో స్పష్టంగా రికార్డు అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మనుషులు ఎవరూ దొంగతనానికి పాల్పడలేదని తేలడంతో షాపు సిబ్బంది ఉపశమనం పొందారు. ఆ తర్వాత పోలీసులు, షాపు వర్గాలు సీలింగ్ భాగాన్ని పరిశీలించి ఎలుక దాచిన ఆభరణాలను సురక్షితంగా బయటకు తీశారు.
ఈ విచిత్రమైన ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దొంగలు ఎంతటి ప్రణాళికలు వేసినా దొరికిపోతారు కానీ, ఈ ఎలుక దొంగను పట్టుకోవడం మాత్రం కష్టమే అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.