
ప్రేమలో పెద్ద పెద్ద ఖరీదైన బహుమతుల కంటే మనస్ఫూర్తిగా ఇచ్చే చిన్న చిన్న కానుకలే ఎంతో అమూల్యమైనవని నిరూపించే ఒక మధురమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక యువకుడు తన ప్రియురాలి కోసం ఒక చిన్న ప్లాస్టిక్ కవర్‌లో కప్పి ఉన్న సర్ ప్రైజ్ గిఫ్ట్ తీసుకువచ్చాడు. ఆమె కళ్ళు మూయించి ఆ కవర్‌ను ఆమె చేతిలో పెట్టాడు. ఏముందో అని ఆత్రుతగా కవర్ ఓపెన్ చేసి చూసిన సదరు యువతి ఒక్కసారిగా అవాక్కైంది. అందులో ఉంది ఏ ఖరీదైన బంగారమో లేదా ఫోనో కాదు.. కేవలం రూ. 10 విలువ చేసే ఒక బొట్టు బిళ్ళల ప్యాకెట్.
సాధారణంగా ఇలాంటి చిన్న బహుమతులు చూస్తే ఎవరైనా నవ్వి ఊరుకుంటారు. కానీ, ఆ యువతి పొందిన ఆనందం వర్ణనాతీతం. తన ప్రియుడు తన ఇష్టాన్ని గుర్తుపెట్టుకుని ఆ బొట్టు బిళ్ళల ప్యాకెట్ తెచ్చాడనే సంతోషంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఇంట్లో నేలపై పడి ఆనందంతో దొర్లుతూ, చిన్నపిల్లలా ఎగిరి గంతేసింది. ఆ తర్వాత వెంటనే ప్రియుడిని హత్తుకుని తన ప్రేమను, కృతజ్ఞతను చాటుకుంది. ఈ క్యూట్ అండ్ లవ్లీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో శరవేగంగా వైరల్ అయ్యింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించగా, వేలాది మంది నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఖరీదైన బహుమతుల కంటే భాగస్వామి భావాలకు విలువ ఇవ్వడమే అసలైన ప్రేమ అని ఒకరు కామెంట్ చేయగా.. ఈ రోజుల్లో ఇలాంటి స్వచ్ఛమైన అనుబంధాలు చూడటం చాలా అరుదు అని మరొకరు రాసుకొచ్చారు. మనుషుల మధ్య బంధాలకు, సంతోషానికి డబ్బు లేదా వస్తువుల విలువ కొలమానం కాదని, ఒకరిపై ఒకరికి ఉండే నిస్వార్థమైన ప్రేమే ముఖ్యమని ఈ చిన్న వీడియో మరోసారి నిరూపించింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..