
ఆకాశంలో ఫిబ్రవరి నెలలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. ఈ సందర్భంగా సూర్యుడు ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ఏర్పరచనున్నాడు. అయితే, ఈ దృశ్యాలు మాత్రం భూమిపై ఉన్న కొన్ని ప్రాంతాల్లోనే స్పష్టంగా కనిపించనున్నాయి. రింగ్ ఆఫ్ ఫైర్ దృశ్యం ప్రధానంగా అంటార్కిటాపై మాత్రమే కనిపించనుందని పౌర అంతరిక్ష కార్యక్రమం, అంతరిక్ష పరిశోధన, వైమానిక పరిశోధనలు జరిపే అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) వెల్లడించింది.
సూర్య గ్రహణం సందర్భంగా ఏర్పడే రింగ్ ఆఫ్ ఫైర్.. ఫిబ్రవరి 17న దక్షిణ హిందూ మహా సముద్రంలో ప్రారంభమై.. రోన్నే ఐస్ షెల్ప్ ద్వారా అంటార్కిటికా తీర ప్రాంతాన్ని దాటి.. దక్షిణ అట్లాంటిక్ మహా సముద్రంలో ముగుస్తుంది. అతిపెద్ద గ్రహణం 12.11 UT (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.41) సంభవిస్తుంది.
అయితే, హైదరాబాద్ సహా భారతదేశంలోని నగరాలు ఈ కంకణాకార సూర్య గ్రహణాన్ని(Ring Of Fire), అగ్ని వలయాన్ని చూడలేవు.
ఎప్పుడు జరుగుతుంది: చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యలో ఉన్నప్పుడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది.
చంద్రుడు భూమికి సూర్యుడి కాంతిని పూర్తిగా లేదా భాగంగా అడ్డుకుంటాడు. ఈ కారణంగా భూమి పై ఉన్న కొన్ని ప్రాంతాలు కాంతి నుంచి దూరమై చీకటి అవుతుంది, దీన్ని సూర్యగ్రహణం అంటారు.
భూమి చంద్రుడు, సూర్యుడు మధ్యలో ఉండి, చంద్రుడిపై భూమి యొక్క నీడ పడినప్పుడు.. భూమి యొక్క ఛాయ (Umbra, Penumbra) చంద్రుడిపై పడుతుంది. దీని వల్ల చంద్రుడు కొంత లేదా పూర్తిగా చీకటిగా, లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది. దీంతో చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.