
మనలో ఎవరికైనా రోడ్డు మీద పదో.. వందో.. దొరికితే కచ్చితంగా దాన్ని జేబులో పెట్టుకునే ఇంటికి పోతాం. మనలోని స్వార్ధం ఆ పని చేసేలా చేస్తుంది. మచ్చుకైనా ఈ కాలంలో నీతి, నిజాయితీని మనం చూడటం తక్కువ. అయితే అలా కాదు.. ఇంకా నిజాయితీ బతికే ఉందని చెబుతూ ఓ మహిళ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ తనకు దొరికిన రూ. 10 లక్షలను నిజాయితీగా వెనక్కి ఇచ్చింది. ఈ పని చేసింది ఓ పారిశుద్ద్య కార్మికురాలు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఈ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళ్తే.. పూణేలోని సదాశివ్ పేఠ్లో అంజు మానే అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. ఆమె ఎప్పటిలానే నవంబర్ 20న ఉదయం 7గంటలకు సదాశివ్ పేఠ్లోని ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరించడం, రోడ్డు ఊడుస్తుండగా.. ఆమెకు ఓ బ్యాగ్ కనిపించింది. ఆ బ్యాగ్ ఏంటా అని చూడగా.. దెబ్బకు షాక్ అయింది. అందులో మందులతోపాటు రూ. 10 లక్షల నగదు ఉండటాన్ని గమనించింది. ఆ డబ్బుకు ఏమాత్రం ఆశపడకుండా తిరిగి ఇవ్వాలనుకుంది.
మొదటిగా ఆ ప్రాంతంలో తనకు తెలిసిన ప్రతీ ఒక్కరిని ఈ బ్యాగ్ మీదేనా.. మీదేనా.. అంటూ అడిగింది. ఈలోపు ఓ వ్యక్తి ఏదో పోగొట్టుకున్నట్టు వీధిలో వెతుకుతూ కనిపిస్తాడు. అతడి దగ్గరకు వెళ్లి అడగగా.. ఆమెకు దొరికిన బ్యాగ్.. అతడిదే అని నిర్ధారించుకుని ఆ రూ. 10 లక్షల బ్యాగ్ తిరిగి ఇచ్చింది. తన నిజాయితీని నిరూపించుకుంది. ఈ క్రమంలోనే ఆమె చేసిన పనితో సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.