లాఠీలతో కొట్టినా.. బూటు కాలితో తన్నినా.. వాటర్ కేనన్లతో తమపై విరుచుకుపడినా.. టియర్ గ్యాస్‌తో ఉక్కిరి బిక్కిరి చేసినా.. అవేవీ పట్టించుకోలేదు ఆ రైతులు. దేశానికి అన్నం పెట్టడం కోసం ఆరుగాలం చేసే కష్టం ముందు ఈ బాధలు ఎంత అనుకున్నారో.. గురునానక్ బోధనల ప్రభావంతో మనుషులందరూ ఒక్కటేనని భావించారో గానీ.. తమను అడ్డుకునేందుకై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడిన పోలీసులకు ఒక్కరిని కూడా వదలకుండా ప్రసాదం పంపిణీ చేసి తాము మనుషులమని, ముఖ్యంగా అన్నదాతలమని మరోసారి రుజువు చేసుకున్నారు.
కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులతో గత ఐదు రోజులుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ రైతుల్లో దాదాపు అందరూ సిక్కులే ఉన్నారు. నేడు గురునానక్ దేవ్ ప్రకాశ్ పర్వ్(551వ జయంతి) సందర్భంగా రైతులు తాము నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సందర్భంగా తయారు చేసిన ప్రసాదాన్ని అక్కడ ఉన్న పోలీసు బలగాలందరికీ పంచి పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఎంతైనా రైతు రైతే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘జై జవాన్.. జై కిసాన్’ మన దేశంలో వినిపించే ప్రధాన నినాదం.. కానీ ఇప్పుడు ఆ జవాన్, కిసాన్ మధ్యే యుద్ధం నడుస్తోంది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Delhi: Farmers protesting at Tikri border (Delhi-Haryana border) offer prayers and distribute ‘prasad’ among each other and security personnel on the occasion of #GuruNanakJayanti pic.twitter.com/2eWZji4z6g
— ANI (@ANI) November 30, 2020