Video: భారీ వర్షాల గురించి లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తూ.. వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్‌! ఎక్కడంటే..?

పాకిస్తాన్‌లోని భారీ వరదల లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న ఓ జర్నలిస్ట్, ప్రమాదకరమైన వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని ధైర్యాన్ని కొందరు ప్రశంసించగా, మరికొందరు అతని నిర్లక్ష్యాన్ని విమర్శించారు. వర్షాల వల్ల 116 మంది మరణించారు.

Video: భారీ వర్షాల గురించి లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తూ.. వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్‌! ఎక్కడంటే..?
Pakistan Journalist

Updated on: Jul 19, 2025 | 6:47 AM

కొన్ని సార్లు జర్నలిస్టులు ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ ఉంటారు. కానీ, అదే ధైర్యం వారి ప్రాణాలకే ముప్పు తీసుకొస్తూ ఉంటుంది. బాంబుల వర్షం పడుతున్నా, భూకంపాలు వచ్చినా, సునామీలు వచ్చినా, కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తున్నా.. తమ కర్తవ్యం నిర్వహించేవారు జర్నలిస్టులు. తాజాగా ఓ జర్నలిస్ట్‌ భారీ వర్షాలు, వరదల గురించి రిపోర్ట్‌ చేస్తూ.. అదే వరదలో కొట్టుకుపోయాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని రావల్పిండిలో చోటు చేసుకుంది. చేతిలో మైక్రోఫోన్ పట్టుకొని మెడ లోతు నీటిలో నిలబడి ఉన్న రిపోర్టర్ లైవ్ కవరేజ్ అందిస్తుండగా, నీటి ఉధృతికి కొట్టుకుపోయాడు. అల్ అరేబియా ఇంగ్లీష్ ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో కేవలం తల, చేయి మాత్రమే కనిపించేలా ఓ జర్నలిస్ట్‌ వరదలో దిగి లైవ్‌ రిపోర్టింగ్‌ అందిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతని ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తూ అతని భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది జర్నలిస్ట్ ధైర్యాన్ని ప్రశంసించగా, మరికొందరు అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో రిపోర్టింగ్‌ చేయాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఇది ధైర్యవంతమైన జర్నలిజమా లేకా రేటింగ్‌ల కోసం నిర్లక్ష్యంగా అతిగా వ్యవహరించడమా అని మరికొంతమంది ప్రశ్నిస్తున్నారు.

116 మంది మృతి..

జూన్ 26 నుండి నిరంతర కుండపోత వర్షాలు పాకిస్తాన్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. దాదాపు 116 మంది మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లో అత్యధికంగా 44 మంది మరణించారు, తరువాత ఖైబర్ పఖ్తుంఖ్వాలో 37 మంది, సింధ్‌లో 18 మంది, బలూచిస్తాన్‌లో 19 మంది మరణించారు. అదనంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)లో ఒకరు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. వరదలు లక్షలాది మందిని ప్రభావితం చేశాయి. వందలాది ఇళ్లను ధ్వంసం చేశాయి. విద్యుత్, నీరు వంటి ముఖ్యమైన సేవలకు అంతరాయం కలిగించాయి. చాహన్ ఆనకట్ట కూలిపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది, రావల్పిండితో సహా అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. ఇక్కడ సహాయ, రక్షణ కార్యకలాపాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి