
అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లో ఉన్న ఒక నర్సింగ్ హోమ్‌లో ఉన్న ఆస్కార్ అనే పిల్లి గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ పిల్లి దాదాపు 100 మందికి పైగా రోగుల మరణాన్ని ముందే ఖచ్చితంగా అంచనా వేసింది. వైద్య ప్రపంచాన్ని సైతం విస్మయానికి గురిచేసిన ఆస్కార్ యథార్థ కథ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
2005లో అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లో ఉన్న స్టీర్ హౌస్ నర్సింగ్ అండ్ పునరావాస కేంద్రం నివాసితులు ఆస్కార్‌ను ఒక చిన్న పిల్లిపిల్లగా దత్తత తీసుకున్నారు. ఈ కేంద్రంలో ప్రధానంగా డిమెన్షియా, తీవ్రమైన ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడే వృద్ధులకు చికిత్స అందించేవారు. ఆస్కార్ సాధారణంగా చాలా శాంతంగా ఉండేది మరియు మనుషులతో ఎక్కువ కలవకుండా తన పని తాను చేసుకునేది.
పిల్లి పెరిగిన కొద్దీ నర్సింగ్ హోమ్ సిబ్బంది ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు. ఆస్కార్ సాధారణంగా రోగుల వద్దకు వెళ్లేది కాదు. కానీ, ఏదైనా రోగి ఆరోగ్యం అత్యంత క్షీణించినప్పుడు, ఆస్కార్ నేరుగా ఆ రోగి గదిలోకి వెళ్ళి, వారి మంచం మీదకు ఎక్కి వారి పక్కనే పడుకునేది. ఆశ్చర్యకరంగా, ఆస్కార్ ఏ రోగి పక్కనైతే పడుకుంటుందో, వారు తదుపరి 2 నుండి 4 గంటల్లోనే మరణించేవారు.
మొదట్లో ఇది కేవలం యాదృచ్ఛికం అని అనుకున్నప్పటికీ, వరుసగా అనేక సంఘటనలు జరగడంతో డాక్టర్ డేవిడ్ డోసా అనే ప్రముఖ వైద్యుడు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆస్కార్ ఒక రోగి పక్కన పడుకోగానే, సిబ్బంది వెంటనే సదరు రోగి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆఖరి నిమిషాల్లో వారితో గడపడానికి పిలిచేవారు. ఆస్కార్ చెప్పిన అంచనా ఒక్కసారి కూడా తప్పు కాలేదు. దాదాపు 100 మందికి పైగా రోగుల విషయంలో ఇది నిజమైంది.
శాస్త్రవేత్తలు, వైద్యుల అభిప్రాయం ప్రకారం, మనుషులు మరణానికి చేరువవుతున్నప్పుడు వారి శరీరంలోని కణాలు నశించి కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు లేదా గ్యాస్‌లు విడుదలవుతాయి. పిల్లులకు ఉండే అత్యంత తీవ్రమైన గ్రాణ శక్తి కారణంగా ఆస్కార్ ఆ రసాయనాల వాసనను పసిగట్టి వారి వద్దకు వెళ్లేదని విశ్లేషించారు.
కారణం ఏదైనప్పటికీ, ఆస్కార్ అనేక కుటుంబాలకు తమ ప్రియతమాత్ములకు ఆఖరి వీడ్కోలు చెప్పే అవకాశాన్ని కల్పించిన ఒక దివ్య జీవిగా చరిత్రలో నిలిచిపోయింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..