అల్గారిథమ్‌కి అర్థం లేదు.. సోషల్ మీడియాను మార్చేద్దాం.. ఆర్కుట్ ఫౌండర్ పిలుపు!
సోషల్ మీడియా అంటే ఒకప్పుడు స్నేహితులతో మాట్లాడటం, కొత్త పరిచయాలు పెంచుకోవడం, ఒకే అభిరుచులు ఉన్నవారితో కలవడం.. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎన్ని గంటలు ఫోన్ చూస్తున్నాం? ఎన్ని లైక్స్ వచ్చాయి? ఎన్ని వ్యూస్ వచ్చాయి అనే లెక్కలే ఎక్కువయ్యాయి. మనుషుల మధ్య నిజమైన అనుబంధాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్కుట్ వ్యవస్థాపకుడు ఆర్కుట్ బ్యూక్కోక్తెన్. సోషల్ మీడియాను తిరిగి మనుషుల కోసం నిర్మించాలంటూ కొత్త ఉద్యమానికి పిలుపునిచ్చారు.

రెండు దశాబ్దాల క్రితమే సోషల్ నెట్‌వర్కింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆర్కుట్ బ్యూక్కోక్తెన్.. ఇంటర్నెట్‌లో మనుషుల మధ్య సంబంధాలు ఎలా మారిపోయాయో తన బహిరంగ లేఖలో వివరించారు. గత 20 ఏళ్లుగా సోషల్ మీడియా సంస్థలు వినియోగదారుల దృష్టిని వీలైనంత ఎక్కువసేపు తమ ప్లాట్‌ఫామ్‌లపై ఉంచడంపైనే దృష్టి పెట్టాయని విమర్శించారు. మనుషులను కలపడం కంటే, వారు ఎక్కువసేపు స్క్రీన్ చూడటమే లక్ష్యంగా ఫీడ్‌లను రూపొందించాయని అన్నారు. వినియోగదారులు ఏం చూస్తున్నారు? దేనికి ఎక్కువ స్పందిస్తున్నారు? అనే అంశాల ఆధారంగా కంటెంట్‌ను చూపించే అల్గారిథమ్‌లు.. వారిని ఆకర్షించి, అదే పనిగా సోషల్ మీడియా ఉపయోగించేలా చేస్తున్నాయని చెప్పారు. దీని వల్ల పిల్లలు, యువతపై కూడా ప్రభావం పడుతోందని ఒంటరితనం, ఆందోళన పెరగడానికి ఈ పరిణామాలు కారణమని అన్నారు. వినియోగదారుల దృష్టిని ఆకర్షించడం ద్వారా ప్రకటనల ఆదాయం సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా మారిందని విమర్శించారు. ‘ఒక అల్గారిథమ్ మన జీవితాన్ని ఆనందమయం చేయలేదు.. కానీ ఒక స్నేహితుడు చేయగలడు. ఒక సమాజం చేయగలదు’ అంటూ కామెంట్ చేసారు.
ఏఐతో మరో ప్రమాదం.. అసలైన మనిషి ఎక్కడ?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతమైన సాంకేతికతేనని అంగీకరించిన ఆర్కుట్.. సోషల్ మీడియా అసలు ఉద్దేశానికే ముప్పు ఏర్పడుతోందని హెచ్చరించారు. గతంలో సోషల్ మీడియాలో మనం ఒక సందేశం పంపితే అవతలి వైపు నిజమైన వ్యక్తి ఉంటారనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు బాట్స్, ఏఐతో రూపొందించిన కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోలు, ఆటోమేటిక్‌గా పనిచేసే ఏజెంట్లు పెరుగుతున్నాయి. దీంతో ఏది నిజమైన సమాచారం? ఎవరు నిజమైన వ్యక్తి? అనే విషయాలను గుర్తించడం కష్టమవుతోంది. సోషల్ మీడియా అనేది మనుషుల మధ్య నిజమైన సంబంధాలను పెంచే వేదికగా ఉండాలి. కేవలం కృత్రిమ కంటెంట్‌తో నిండిపోయే స్థలంగా మారకూడదని స్పష్టం చేశారు.
ఆర్కుట్ రోజులు గుర్తున్నాయా? కమ్యూనిటీలే అసలైన బలం!
ఒకప్పుడు ఇంటర్నెట్‌ను ఉపయోగించిన చాలామందికి ఆర్కుట్ సోషల్ నెట్‌వర్క్ గుర్తుండే ఉంటుంది. స్నేహితులతో కనెక్ట్ అవ్వడం, ఫొటోలు పంచుకోవడం మాత్రమే కాదు.. ఒకే అభిరుచులు ఉన్నవారితో ప్రత్యేక కమ్యూనిటీల్లో చేరడం కూడా ఆర్కుట్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. ఒకే రకమైన మోటార్‌సైకిళ్లను రిపేర్ చేసే వ్యక్తులు, ఒకే బస్సు మార్గంలో ప్రయాణించే వారు, సోమవారాలను ఇష్టపడని వారు.. ఇలా రకరకాల అభిరుచులు, ఆసక్తులు ఉన్నవారు తమకంటూ ప్రత్యేక గ్రూపులను ఏర్పాటు చేసుకునేవారు. ప్రస్తుత సోషల్ మీడియా ఫీడ్‌లలో మనం కేవలం కంటెంట్‌ను చూసే ప్రేక్షకులుగా మిగిలిపోతున్నాం. కమ్యూనిటీల్లో అయితే ఒక సభ్యుడిగా ఉంటాం అంటున్నారు ఆర్కుట్. ఫీడ్‌లో మనం ప్రేక్షకులం.. కమ్యూనిటీలో మనం సభ్యులం అన్నది ఆయన మాట.
జీవితానికి ఆనందం ఇచ్చేది ఏఐ కాదు.. మనుషులే!
జీవితాన్ని అర్థవంతంగా మార్చేవి ఆనందం, ఆశ, కృతజ్ఞత, ఆశ్చర్యం, స్ఫూర్తి, ప్రేమ, వినోదం వంటి అనుభూతులే అని ఆర్కుట్ అన్నారు. వీటిని అల్గారిథమ్‌లు సృష్టించలేవని, మనుషుల మధ్య ఏర్పడే నిజమైన సంబంధాలే జీవితానికి విలువను ఇస్తాయని చెప్పారు. తాను ఈ ప్రపంచంలోకి ఒంటరిగా, ఏమీ లేకుండా వచ్చానని.. ఆ తర్వాత జీవితంలో సంపాదించిన ప్రతిదానికీ ప్రేమే కారణమని తన లేఖలో భావోద్వేగంగా వివరించారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, మనుషుల మధ్య అనుబంధాలకు ప్రత్యామ్నాయం కాలేదన్నది ఆయన అభిప్రాయం. సోషల్ మీడియా సంస్థలు వినియోగదారులు ఎంతసేపు ఆన్‌లైన్‌లో ఉన్నారనే దానికంటే, వారు ఇతరులతో ఎంత నిజమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుంటున్నారనే దానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
మళ్లీ మనుషుల కోసం ఇంటర్నెట్.. ఆర్కుట్ పిలుపు
భవిష్యత్తులో ఇంటర్నెట్ నిజమైన వ్యక్తుల చుట్టూ నిర్మితమవ్వాలని ఆర్కుట్ ఆకాంక్షించారు. ప్రతి సందేశం వెనుక ఒక నిజమైన మనిషి ఉండేలా, స్నేహం, దయ, ఆసక్తి, నమ్మకం, పరస్పర అనుబంధాలకు ప్రాధాన్యం ఇచ్చే వేదికలు రావాలని కోరారు. ఈ మార్పు ఒక్కరితో సాధ్యం కాదని చెబుతూ.. ప్రజలందరూ తన ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం orkut.com వెబ్‌సైట్‌ను సందర్శించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని, తమతో కలిసి ఈ మార్పులో భాగం కావాలని కోరుకునే ఒకరికి మద్దతు కార్డును పంపి, వారిని ఎందుకు ఎంచుకున్నారో వివరించాలని సూచించారు. సోషల్ మీడియా భవిష్యత్తు కేవలం అల్గారిథమ్‌లు, వ్యూస్, లైక్స్, స్క్రీన్ టైమ్ చుట్టూ తిరగకూడదని స్పష్టం చేశారు. ‘జీవితాన్ని విలువైనదిగా మార్చేది అల్గారిథమ్ కాదు.. ఒక స్నేహితుడు. ఒక కమ్యూనిటీ’ అంటూ ఆర్కుట్ చేసిన పిలుపు.. డిజిటల్ ప్రపంచంలో మనుషుల మధ్య నిజమైన సంబంధాలు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేస్తోంది.