Watch: చిల్లర లేదంటూ మంత్రినే బస్సు దిగమన్న కండక్టర్..! ఆ తర్వాత సీన్ ఇదే..

నిత్యం ఆర్టీసీ బస్సులు ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి ఏకంగా రవాణా శాఖ మంత్రి మారు వేషంలో రంగంలోకి దిగారు. బస్సు ఎక్కి కండక్టర్ కి రూ.100 ఇచ్చి టికెట్ ఇవ్వమన్నారు. అంతే కండక్టర్ అంత ఎత్తున ఎగిరి చిల్లర ఇవ్వమన్నాడు. లేదంటే బస్సు తిగిపోవాలని హుకూం జారీ చేశాడు..

Watch: చిల్లర లేదంటూ మంత్రినే బస్సు దిగమన్న కండక్టర్..! ఆ తర్వాత సీన్ ఇదే..
Karnataka Transport Minister Bmtc Bus Surprise Inspection

Updated on: Jul 13, 2026 | 11:52 AM

బెంగళూరు, జులై 13: కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ చేపట్టిన ఆకస్మిక తనిఖీ ఆయనకే ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. సాధారణ ప్రయాణికుడిలా మారువేషంలో బీఎంటీసీ (BMTC) బస్సుల్లో ప్రయాణించిన మంత్రి, రోజూ ప్రజలు ఎదుర్కొనే సమస్యలను ప్రత్యక్షంగా అనుభవించారు. శనివారం ముఖానికి మాస్క్ ధరించి దాదాపు రెండు గంటల పాటు 10కు పైగా బీఎంటీసీ బస్సుల్లో ప్రయాణించిన మంత్రి, ప్రయాణికుల ఇబ్బందులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి.

తనిఖీల సమయంలో జరిగిన ఒక ఘటన ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. హెబ్బాల్–నాగశెట్టిహళ్లి మార్గంలో నడిచే బస్సులో మంత్రి టికెట్ కొనుగోలు కోసం కండక్టర్‌కు రూ.100 నోటు ఇచ్చారు. అయితే చిల్లర లేదని చెప్పిన కండక్టర్, టికెట్ ఇవ్వకుండా బస్సు దిగిపోవాలని సూచించాడు. దీంతో సాధారణ ప్రయాణికులు తరచుగా ఎదుర్కొనే సమస్యను మంత్రి స్వయంగా అనుభవించారు. అంతకుముందు ఫన్ వరల్డ్ బస్ స్టాప్ వద్ద ఒక ప్రయాణికుడు దిగేందుకు సంకేతం ఇచ్చినప్పటికీ బస్సు ఆపకుండా వెళ్లిపోయిందని మంత్రి గుర్తించారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, సంబంధిత డ్రైవర్ మరియు కండక్టర్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. బస్సు ప్రయాణం అనంతరం నాగశెట్టిహళ్లిలో మరో ఘటన మంత్రి దృష్టికి వచ్చింది. ఒక ఆటో డ్రైవర్ మీటర్‌లో రూ.30 మాత్రమే చూపించినప్పటికీ రూ.36 డిమాండ్ చేయడంతో ప్రయాణికుడికి, ఆటో డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మంత్రి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు.

ఈ ఆకస్మిక తనిఖీలు ప్రజా రవాణా వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడానికే అని మంత్రి బైరతి సురేష్ తెలిపారు. రవాణా సిబ్బందిలో క్రమశిక్షణను పెంపొందించడం, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం కోసం ఇటువంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. మంత్రి చేపట్టిన ఈ మారువేష తనిఖీ ప్రస్తుతం కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రజాప్రతినిధులు ఇలాంటి చర్యలు చేపట్టడం అభినందనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us