భూమి వైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్ .. భారత్‌లో శకలాలు ఎక్కడ పడతాయంటే..!
22 ఏళ్ల పాటు అంతరిక్షంలో తిరుగుతూ విశ్వ రహస్యాలను ఛేదించిన నాసా టెలిస్కోప్ ఇప్పుడు భూమి వైపు తిరిగి వస్తోంది. ఏకంగా 1.5 టన్నుల బరువున్న ఈ భారీ అంతరిక్ష పరిశోధన కేంద్రం భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. ఆ సమయంలో తీవ్ర వేడికి దాని చాలా భాగాలు కాలిపోయే అవకాశం ఉన్నప్పటికీ.. కొన్ని శకలాలు మాత్రం భూమిని చేరవచ్చని అంచనా వేస్తున్నారు. వాటిలో కొన్ని దక్షిణ భారతదేశంలో పడే అవకాశాలు ఉండటంతో టెన్షన్ నెలకొంది.

నాసా 2004లో నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీని అంతరిక్షంలోకి పంపించింది. విశ్వంలో సంభవించే అత్యంత శక్తిమంతమైన పేలుళ్లలో ఒకటైన గామా కిరణాల విస్ఫోటనాలను (Gamma-ray Bursts) అధ్యయనం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఇందులో మూడు అత్యాధునిక టెలిస్కోపులను ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఈ అబ్జర్వేటరీని కేవలం రెండేళ్ల పాటు పనిచేసేలా రూపొందించారు. కానీ శాస్త్రవేత్తల అంచనాలను మించి ఏకంగా 22 ఏళ్లకు పైగా అంతరిక్షంలో సేవలందించింది. ఎంతో అద్భుత సమాచారాన్ని భూమికి చేరవేసి విశ్వ రహస్యాలను ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది.
ఇప్పుడు తన సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలుకుతూ భూమి వైపు తిరిగి వస్తోంది. నవంబర్ 4న భూమి వాతావరణంలోకి ప్రవేశించే సమయంలో వాతావరణ ఘర్షణ కారణంగా ఉత్పన్నమయ్యే తీవ్ర వేడికి అబ్జర్వేటరీలోని చాలా భాగాలు కాలిపోయి నశించిపోతాయి. అయితే కొన్ని బలమైన భాగాలు మాత్రం పూర్తిగా కాలిపోకుండా భూమి వరకు చేరే అవకాశం ఉంది. ఈ శకలాల్లో ఎక్కువ భాగం సముద్రంలో పడవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
భారత్‌లో ఎక్కడెక్కడ శకలాలు పడే అవకాశం?
ఈ అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించే మార్గాన్ని శాస్త్రవేత్తలు అక్షాంశాల ఆధారంగా అంచనా వేశారు. దక్షిణ భారతదేశంతో పాటు ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, మధ్య, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలపైనా శకలాలు పడే అవకాశం ఉంది. భారత్‌లో ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, భువనేశ్వర్, కొచ్చి నగరాలు దాని పరిధిలో ఉన్నాయి. అయితే ఈ నగరాల్లోనే శకలాలు పడతాయని అర్థం కాదు. అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశించే ఖచ్చితమైన సమయం, దాని ప్రయాణ మార్గాన్ని బట్టి శకలాలు పడే ప్రాంతం మారవచ్చు.
భూమి ఉపరితలంలో దాదాపు 70 శాతం సముద్రాలే విస్తరించి ఉండటంతో.. అంతరిక్ష నౌక నుంచి విడిపోయే శకలాల్లో ఎక్కువ భాగం సముద్రంలో పడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే భూభాగంపై పడే ప్రమాదాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త బ్రాడ్ టక్కర్ అభిప్రాయపడ్డారు. ఆయన చెప్పిన ప్రకారం.. భూమిపై ప్రతి పది సందర్భాల్లో మూడు సార్లు శకలాలు సముద్రంలో కాకుండా భూభాగంపై పడే అవకాశం ఉంటుంది. అందుకే ఈ అంతరిక్ష నౌక ఎక్కడ పడుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
విశ్వ రహస్యాలను ఛేదించిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ
22 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో స్విఫ్ట్ అబ్జర్వేటరీ విశ్వంలోని ఎన్నో అంతుచిక్కని రహస్యాలను వెలుగులోకి తెచ్చింది. గామా కిరణాల శక్తిమంతమైన పేలుళ్లను గుర్తించడంతో పాటు.. అంతరిక్షంలో చోటుచేసుకున్న అనేక అద్భుత, అరుదైన ఘటనలను నిరంతరం పరిశీలించింది. సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ప్రభావంతో చురుగ్గా పనిచేసే గెలాక్సీలు, నక్షత్రాల నుంచి వెలువడే ఎక్స్‌రే విస్ఫోటనాలు, సూపర్‌నోవా పేలుళ్లపై విలువైన సమాచారాన్ని సేకరించింది. మన సౌర కుటుంబంలోని తోకచుక్కలు, గ్రహశకలాలను కూడా తన టెలిస్కోపుల ద్వారా పరిశీలించింది.
అంతేకాదు.. విశ్వంలో ఎక్కడైనా అకస్మాత్తుగా స్వల్ప వ్యవధిలో జరిగే శక్తిమంతమైన పేలుళ్లను క్షణాల్లో గుర్తించి, ఆ సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర పరిశోధనా కేంద్రాలకు చేరవేసేది. దీంతో వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు వెంటనే అప్రమత్తమై, ఆ ఘటనలను మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు వీలయ్యేది. ఇలా కేవలం రెండేళ్ల మిషన్ లక్ష్యంతో అంతరిక్షంలోకి వెళ్లిన స్విఫ్ట్ అబ్జర్వేటరీ.. అనూహ్యంగా 22 ఏళ్లకు పైగా సేవలందించి శాస్త్రవేత్తలకు ఎన్నో విలువైన వివరాలను అందించింది.
ఇప్పుడు తన సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి ముగింపు పలుకుతూ భూమి వైపు తిరిగి వస్తోంది. ఇన్నేళ్ల పాటు విశ్వ రహస్యాలను ఛేదించిన ఈ అబ్జర్వేటరీ.. చివరికి భూమిపై ఎక్కడ తన శకలాలను వదులుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.